Share News

Road accident: చేవెళ్ల ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:45 AM

చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది బంధువులు, కుటుంబ సభ్యులు చేవెళ్ల ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు...

Road accident: చేవెళ్ల ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు

చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది బంధువులు, కుటుంబ సభ్యులు చేవెళ్ల ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతి చెందిన తమ వారిని తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. దీంతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటాయి. ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రిలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. యాలాల్‌ మండలం హజీపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు బందప్ప, లక్ష్మి మృతి చెందడంతో అనాథలైన వారి ఇద్దరు కూతుళ్లు శివలీల, భవాని ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. గచ్చిబౌలిలో ఎంబీఏ చదువుకుంటున్న యువతి అఖిల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తాండూరు పటణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్యగౌడ్‌ ముగ్గురు కుమార్తెలు సాయిప్రియ, తనూష, నందిని.. ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతుల బంధువులను పోలీసులు, ప్రజాప్రతినిఽధులు సైతం ఓదార్చారు.

Updated Date - Nov 04 , 2025 | 02:45 AM