Share News

Damodara Rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:59 AM

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. తమ సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు..

Damodara Rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి

నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు మంత్రి దామోదర విజ్ఞప్తి

  • రాజకీయ దురుద్దేశంతో కొందరి కుట్రలు

  • ఈ నెల రూ.100 కోట్లు విడుదల చేశాం

  • మీడియాతో చిట్‌చాట్‌లో వైద్య మంత్రి

  • అనుబంధ ఆస్పత్రులకు పూర్వవైభవం

  • అధికారులతో సమీక్షలో దామోదర

  • నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిర్ణయం మార్చుకోవాలి

  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఉదయ్‌కుమార్‌

  • ససేమిరా అంటున్న యాజమాన్యాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. తమ సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో తనను కలసిన మీడియా ప్రతినిఽధులతో మంత్రి దామోదర చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై స్పందిస్తూ.. ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులతో నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఇస్తున్నామని, ఈ నెలకు సంబంధించి రూ.100 కోట్లను సోమవారం (15న) చెల్లించామని చెప్పారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రెండు వర్గాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ఆస్పత్రులు సమ్మెకు వెళ్లేలా లేవన్నారు. మరోవైపు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఉదయ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతోపాటు గడచిన 21 నెలల్లో ఆస్పత్రులకు రూ.1779 కోట్లను చెల్లించిందని తెలిపారు.


ఈ నెల రూ.100 కోట్ల చెల్లింపు..

చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.29 కోట్లను ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఖర్చు చేస్తోందని ఉదయ్‌కుమార్‌ తెలిపారు. హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు రూ.100 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ేసవల నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు సీఈవో విజ్ఞప్తి చేశారు. అయితే ఇందుకు ప్రైవేటు ఆస్పత్రుల నెట్‌వర్క్‌ అసోసియేషన్‌ నిరాకరించింది. మంగళవారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్‌ ప్రకటించారు. బకాయులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందన్నారు. తమ డిమాండ్లపై వెంటనే చర్చలు జరపాలని కోరారు.

అనుబంధ ఆస్పత్రులకు పూర్వవైభవం తెద్దాం: దామోదర

ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రులకు పూర్వవైభవం తీసుకొద్దామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అధికారులకు సూచించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల పనితీరు, ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతుల కల్పన తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సాధారణంగా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా రెండు ఆస్పత్రులు మాత్రమే ఉంటాయని, కానీ, ఉస్మానియా కాలేజీకి మాత్రం 10 అనుబంధ ఆస్పత్రులు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి ఉస్మానియా ఆస్పత్రితోపాటు, నిలోఫర్‌ ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్‌ హాస్పిటల్‌, టీబీ అండ్‌ చెస్ట్‌ హాస్పిటల్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రి, పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్‌టీ హాస్పిటల్‌, ఫీవర్‌ హాస్పిటల్‌ అనుబంధంగా ఉన్నాయని వివరించారు. ఎంతో ముందుచూపుతో ఏర్పాటైన ఈ హాస్పిటళ్లకు, పూర్వవైభవం తీసుకొద్దామన్నారు. కాగా, ఆస్పత్రులను ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరేంద్రకుమార్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈఎన్‌టీ ఆస్పత్రి కోసం కొత్త భవనం నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, ఉస్మానియా డెంటల్‌ కాలేజీకి సంబంధించిన భూమి సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

Updated Date - Sep 17 , 2025 | 05:59 AM