Share News

MP R Krishnaiah: సుప్రీం తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు స్టే

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:00 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని...

MP R Krishnaiah: సుప్రీం తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు స్టే

  • త్వరలో బీసీ మిలియన్‌ మార్చ్‌ : ఆర్‌.కృష్ణయ్య

బర్కత్‌పుర, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఆ ప్రక్రియపై ఎలా స్టే విధిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా ఈ నెల 14న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు 22 ప్రజాసంఘాలు మద్దతునిచ్చాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ బంద్‌లో భాగస్వామ్యం కావాలని ఆర్‌.కృష్ణయ్య కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో కాచిగూడలోని ఓ హోటల్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు రాజ్యాంగంలో 243డి6 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా.. హైకోర్టు స్టే ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్‌ విజయవంతమైన తర్వాత బీసీల మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని కృష్ణయ్య చెప్పారు. ఉమ్మడి జిల్లాల్లో లక్ష మందితో బారీ బహిరంగ సభలు జరపనున్నట్లు తెలిపారు.

బంద్‌కు మద్దతు కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 14న జరిగే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఆర్‌.కృష్ణయ్య వినతి పత్రం సమర్పించారు. బర్కత్‌పురాలోని కేంద్ర మంత్రి నివాసానికికెళ్లి వినతి పత్రం అంద చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ పార్టీ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 04:00 AM