HC Notice on Illegal Tower: చెరువు భూమిలో 8 భారీ టవర్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:08 AM
ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎనిమిది భారీ టవర్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై...
వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, బిల్డర్లకు హైకోర్టు నోటీసులు
ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్
హైడ్రా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎనిమిది భారీ టవర్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బిల్డర్లకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌లు దాఖలుచేయాలని స్పష్టం చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), యెన్నం శ్రీనివా్‌సరెడ్డి (మహబూబ్‌నగర్), మురళీనాయక్ భూక్యా (మహబూబాబాద్), కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్)లు ఈ ఏడాది మేనెలలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామపరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబరు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్... డెవల్‌పమెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (డీఏజీపీఏ) పొందిన సోహిని బిల్డర్స్‌తో కలిసి 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. వివాదంలో ఉన్న ఆ భూమిని రెవెన్యూ అధికారులు ఆ బిల్డర్లకు బదిలీ చేయడం చెల్లదని పేర్కొన్నారు. అధికారులు ప్రయివేటు వ్యక్తులతో కుమ్మక్కయి కబ్జాకు సహకరించారని ఆరోపించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే నెంబర్లు, లొకేషన్ వివరాలతో రెండోసారి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వివాదంలో ఉన్న భూమి విలువ దాదాపు రూ. 8 వేల కోట్లు ఉంటుందని, చాలా వేగంగా నిర్మాణాలు జరుగుతున్నందున అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రభుత్వ అనుమతితోనే భూబదిలీ జరిగిందని, జీహెచ్‌ఎంసీ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీల అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తికావచ్చిందని చెప్పారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.