Hyderabad High Court: సృష్టి బాధిత మహిళకే ఆ శిశువును అప్పగించండి
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:32 AM
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయిన పిటిషనర్ మహిళ.. తాను బయోలాజికల్ మదర్‌గా...
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయిన పిటిషనర్ మహిళ.. తాను బయోలాజికల్ మదర్‌గా విశ్వసించి పెంచుకున్న శిశువును ఆమెకే అప్పగించాలని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఈ కేసుకే వర్తిస్తాయని స్పష్టం చేసింది. శిశువిహార్ ఉంచిన చిన్నారిని తమకే అప్పగించాలంటూ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ వాదనలు విన్న ధర్మాసనం.. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత చేసిన మోసంలో పిటిషనర్ దంపతులు బాధితులని అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికే అప్పగించాలని అధికారులను ఆదేశించింది. రెండు నెలలుగా వారి సంరక్షణలోనే చిన్నారి ఉందని, వారు ప్రేమగానే చూసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అవసరమైతే అధికారులు శిశువును ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఒకరోజులో తేల్చలేమని.. సుదీర్ఘ విచారణ అవసరమని అభిప్రాయపడింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, శిశు సంక్షేమ కమిటీ, శిశువిహార్ సూపరింటెండెంట్, గోపాల్‌పురం ఎస్‌హెచ్‌వో, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదాపడింది.