Group 2 Results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:53 AM
గ్రూప్ 2 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా..
పురుషుల్లో టాపర్ హర్షవర్ధన్.. మహిళల్లో వినీషారెడ్డి.. 783 పోస్టులకు గాను 782 మంది ఎంపిక
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 782 పోస్టులకు ఎంపికైనవారి జాబితాను వెబ్‌సైట్లో ఉంచింది. విజేతలు కోరిన విధంగా వారికి శాఖలు కేటాయించామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పురుషుల్లో హర్షవర్ధన్ టాపర్‌గా నిలవగా.. సచిన్, మనోహర్ రావు, శ్రీరామ్ మధు, ప్రీతం రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహిళల్లో వినీషారెడ్డి టాపర్‌గా నిలవగా, సుస్మిత, శ్రీదేవి, శ్రీలత, స్నేహ తొలి ఐదు స్థానాలు సాధించారని చైర్మన్ వెల్లడించారు. పురుషుల్లో మొదటి ర్యాంకర్ హర్షవర్ధన్ సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జేఏడీ)లో ఏఎ్‌సవో పోస్టును సాధించగా, మిగతా నలుగురూ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ పోస్టులను ఎంచుకున్నారు. మహిళల్లో నాలుగో ర్యాంకరు శ్రీలత మునిసిపల్ కమిషనర్, మిగతా నలుగురూ రెవెన్యూ శాఖలో నాయబ్ తహసీల్దార్ పోస్టులను ఎంచుకున్నారు. మొత్తం పోస్టుల్లో క్రీడా కోటాలో 7 రిజర్వేషన్లు ఉండగా, అర్హులైనవారు కేవలం ఒక్కరే నియమితులయ్యారు. మిగతా 6 పోస్టులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నవిధంగా ప్రతిభ ఆధారంగా ఓసీ విభాగం నుంచి ఎంపిక చేశారు.