Share News

Harish Reddy urged: మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వాలి

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:27 AM

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామంటూ చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు....

Harish Reddy urged: మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వాలి

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామంటూ చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులును వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం సీఎం రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో నిజామాబాద్‌కు చెందిన ఓ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను హరీశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నామని ఆమె అందులో ఆరోపించారు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. బిల్లులు, జీతాల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగే పరిస్థితి రావడం కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీవర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశచరిత్రలో ఇతర ప్రభుత్వాలేవీ చేపట్టిన దాఖలాల్లేవని హరీశ్‌రావు అన్నారు. కులవృత్తులకు సహకారం అందించడంతోపాటు విద్యా సంస్థల ఏర్పాటు వరకు కేసీఆర్‌ చేసిన మేలు బీసీవర్గాలు మర్చిపోలేదని, వారంతా ఆయన వెంటే ఉన్నారని తెలిపారు.

రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెడతాం: బీఆర్‌ఎస్‌ నేతలు

బీసీ రిజర్వేషన్ల విషయంలో మాటలు మార్చి చివరకు మొండిచేయిచూపిన సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని బీఆర్‌ఎస్‌ బీసీ నేతలు హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు వి.శ్రీనివా్‌సగౌడ్‌, బండప్రకాష్‌, మధుసూదనాచారి, వద్దిరాజు రవిచంద్ర, జోగురామన్న సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల ద్వారా రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు ప్రతిపాదిస్తామనివారు తెలిపారు.

Updated Date - Nov 25 , 2025 | 04:28 AM