Harish Rao: అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో రేవంత్
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:32 AM
ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు..
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 2016లో రూ.2052 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే.. ఆ ఘనత తమదే అన్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాధించిన విజయాలను తనవిగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారం చేపట్టేనాటికి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి పూర్తికాలేదని, ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ కూడా పూర్తికాలేదని చెప్పారు. కాళేశ్వరంలో భాగంగానే ఎల్లంపల్లి నిర్మాణం చేపట్టామని.. ఆ నిజాన్ని సీఎం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మంచి నీటికోసం మల్లన్నసాగర్‌లో స్లూయిస్ కూడా నిర్మించిపెట్టారన్నారు. ఇప్పుడు గండిపేట, హిమాయత్‌సాగర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల ద్వారానే నీళ్లు తేవడానికి కొబ్బరికాయ కొట్టారా లేదా? అని నిలదీశారు. గ్రూప్ -1 పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని హరీశ్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గప్పాలుకొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలన్న సోయి కూడా లేదని విమర్శించారు.