Former minister Harish Rao: దండుపాళ్యం ముఠాలా రేవంత్ క్యాబినెట్
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:00 AM
అక్రమాలు, అరాచకాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని రేవంత్ రెడ్డి మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా వ్యవహరిస్తోందని...
కాంగ్రెస్ పాలనలో పెరిగిన గన్ కల్చర్
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై కేంద్రంలోని బీజేపీ మౌనం వీడాలి: హరీశ్ రావు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అక్రమాలు, అరాచకాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని రేవంత్ రెడ్డి మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన బెట్టి కాంట్రాక్టులు, కమీషన్లు, వాటాలు, కబ్జాలు, మంత్రుల పంచాయితీలపై చర్యకే రాష్ట్ర క్యాబినెట్ పరిమితమైందని ఎద్దేవా చేశారు. రేవంత్ క్యాబినెట్ అరడజను వర్గాలుగా విడిపోయిందని దెప్పి పొడిచారు. మంత్రివర్గ భేటీలో మంత్రులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా మారిందని స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి పాలనతో తుపాకులు గురి పెట్టి బెదిరించే సంస్కృతి (గన్ కల్చర్) పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తలను, సినీ రంగ, రియల్ ఎస్టేట్ రంగాల వారిని తుపాలతో బెదిరిస్తున్నట్లు ఆరోపణలున్నాయన్న హరీశ్ .. వారితోపాటు పేదలు, కార్మికులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. తన తమ్ముళ్ల కోసం ఫైళ్లను సీఎం నిలిపివేస్తున్నారని, ఆయన సన్నిహితులే తుపాకీతో బెదిరించే పరిస్థితులున్నాయని ఓ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారని అన్నారు. వాటాల కోసం దేవాదాయశాఖ టెండర్లను మరో శాఖకు మార్చి.. తమ సంస్థలకు మంత్రులు టెండర్లు దక్కించుకుంటున్నారని హరీశ్ ఆరోపించారు. రెడ్ బుక్ ఏ బుక్ ఉండదని.. ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారని, కానీ, టెండర్లు వేయొద్దని బెదిరిస్తున్న మంత్రులు, తుపాకులు పట్టుకుని తిరుగుతున్న సీఎం సన్నిహితులకు ఖాకీ బుక్‌లో వేరే రూల్స్ ఉన్నాయా? ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోరెందుకు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మౌనం తగదన్న హరీశ్.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. కమీషన్లు దండుకోవడానికే హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపడతామని కాంగ్రెస్ సర్కారు కొత్త పాట పాడుతోందని హరీశ్ ఆరోపించారు. ఆ విధానమే బోగస్ అన్నారు.