Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది!
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:26 AM
అన్ని వర్గాల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అన్యాయమని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర......
దసరాకు సర్కారు ఉద్యోగులకు నిరాశే మిగిలింది
5 పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలి
దక్షిణ భారతదేశానికి కేంద్రం అన్యాయం: హరీశ్‌రావు
సిద్దిపేట, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అన్యాయమని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దసరా పండుగ నేపథ్యంలో కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రె్‌సది అభయ హస్తం కాదని భస్మాసుర హస్తమని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బుధవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా్‌సతో కలిసి మీడియాతో హరీశ్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలన్నారు. 15 నెలల నుంచి ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కోసం కట్ చేసిన కాంట్రిబ్యూటరీ ఫండ్‌ను ప్రభుత్వం వాడుకుందని, రూ.5,500 కోట్ల కాంట్రిబ్యూటర్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. బతుకమ్మకు ఆడబిడ్డలకు చీరల్లేవని, రైతులకు యూరియా, సన్న వడ్లకు బోనస్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్య భరోసా కార్డు ఎక్కడని నిలదీశారు. గోధుమల మద్దతు ధరను పెంచిన కేంద్రం.. దక్షిణాదిలో ఎక్కువగా పండించే వరికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరికి మద్దతు ధర పెంచేలా చూడాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు..
తెలంగాణలో 2014లో 1,347 రైతు ఆత్మహత్యలు నమోదవ్వగా, 2023 నాటికి 56కు పరిమితమయ్యాయని జాతీయ నేర గణాంక నివేదిక స్పష్టం చేస్తోందని హరీశ్ తెలిపారు. కేసీఆర్‌పై నోరు పారేసుకునే కాంగ్రెస్ నేతలకు ఇది చెంపపెట్టు లాంటిదని.. బీఆర్‌ఎస్ పాలనలో రికార్డు స్థాయిలో అన్నదాతల ఆత్మహత్యల్లో 95.84ు తగ్గుదల నమోదైందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.