Share News

Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్‌.. నీలా నేను అవసరానికో పార్టీ మారను!

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:14 AM

పూటకో మాట మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటు నీది. స్కూల్‌ బీజేపీ, కళాశాల టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌ అని చెప్పుకొంటున్న నువ్వు రేపు ఏ పార్టీలోకి వెళతావో..? నీలాగా నేను అవసరానికో పార్టీ మారను....

Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్‌.. నీలా నేను అవసరానికో పార్టీ మారను!

  • ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘పూటకో మాట మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటు నీది. స్కూల్‌ బీజేపీ, కళాశాల టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌ అని చెప్పుకొంటున్న నువ్వు రేపు ఏ పార్టీలోకి వెళతావో..? నీలాగా నేను అవసరానికో పార్టీ మారను’’ అని సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తనపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, రంగులు మారుస్తూ సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ ఎదిగానని చెప్పుకొనే చరిత్ర ఆయనదని, ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తనకు కన్నతల్లి లాంటిదన్నారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్‌ రెడ్డి పీసీసీ పదవి కొనుగోలు చేశారని గతంలో కోమటిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్‌ సిటీ, పాలమూరు ప్రాజెక్టు, పింఛన్‌ రూ.4 వేలు, కృష్ణా, గోదావరి జలాలు తదితరాలపై కేసీఆర్‌ ప్రశ్నలు సంధిస్తే.. సమాధానం చెప్పలేక సీఎం అబద్ధాలు, తిట్లకు తెగబడ్డారని మండిపడ్డారు. కేసీఆర్‌ స్టేట్స్‌మన్‌లా మాట్లాడితే.. రేవంత్‌ రెడ్డి స్ట్రీట్‌ రౌడీలా, గూండాలా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌ హయాం ఆర్థిక అరాచకత్వమని రేవంత్‌ విమర్శించడం ఆయన మరుగుజ్జు మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సుబ్బారావు సీఎం ముందే వేదికపై మాట్లాడిన మాటలను ఒకసారి వీడియో పెట్టుకొని చూడాలని హితవు పలికారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్బుత ఆర్థిక ప్రగతిని సాధించిందని, మూడు రెట్ల జీఎ్‌సడీపీని సాధించిందంటూ వారు పదేళ్ల కేసీఆర్‌ పాలనను మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. కాంగ్రె్‌సకు అపార అనుభవం ఉందని, నిధులు ఎలా సమీకరించాలో.. ప్రజలకు ఎలా ఇవ్వాలో తెలుసన్నవారి అనుభవం ఏమైందని ప్రశ్నించారు. మీ అనుభవం అంతా దోపిడీలకు, కమీషన్‌లకు, వాటాలకు, లూటీలకే సరిపోయిందా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ వెనక్కు వచ్చిందంటూ ఉత్తమ్‌ చెప్పేది శుద్ద అబద్ధమని, 2023లోనే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ద్వారా పలు అనుమతులు పొందామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 90 టీఎంసీల ప్రాజెక్టుకు అనుమతించాలని కోరితే.. మీరు 45 టీఎంసీలకే ఒప్పుకొని లేఖ రాసిన విషయం వాస్తవం కాదా!? అని నిలదీశారు.


అందుకు ఇదిగో సాక్ష్యం అంటూ ఉత్తమ్‌ రాసిన లేఖను ప్రదర్శించారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు కోసం రిజర్వాయర్లు, టన్నెళ్లు, పంప్‌హౌ్‌సలు, సబ్‌స్టేషన్లు సిద్ధం చేశాం. రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే.. 30 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పూర్తి సిస్టమ్‌ను సిద్ధం చేశాం. రెండేళ్లలో కాంగ్రెస్‌ తట్టెడు మట్టి ఎత్తలేదు. ఉత్తర కుమార ప్రగల్బాలు తప్ప ఉత్తమ్‌ చేసేదేమీ లేదు. సాగు నీటి విషయంలో ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి విమర్శలు చేయాలి’’ అని హెచ్చరించారు. రెండేళ్ల బడ్జెట్‌లో 11,60,895 ఎకరాలకు నీళ్లిస్తామని పేర్కొన్నారని, 11 వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదని, ఇందుకు మోసం చేశామంటూ సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించామని, 31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, ఇవేవీ తెలుసుకోకుండా బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని ఉత్తమ్‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

500 టీఎంసీలిచ్చి.. మిగిలినవి తీసుకుపొమ్మనేందుకు నువ్వెవరు?

‘‘గోదావరి జలాల్లో 900 టీఎంసీల వాటా కోసం పోరాడాలని లాయర్లకు చెబుతావ్‌. వెంటనే 500 టీఎంసీలు మాకిచ్చి.. మిగిలిన నీళ్లన్నీ తీసుకోమని చంద్రబాబుకు చెప్పేందుకు నువ్వెవరు!?’’ అని రేవంత్‌ రెడ్డిని హరీశ్‌ రావు నిలదీశారు. గతంలో, ఇప్పుడూ కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్సేనని, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి పదకొండున్నరేళ్లలో కృష్ణాలోని తెలంగాణ నీటి వాటాలో అతి తక్కువ నీటిని వినియోగించింది రేవంత్‌ పాలనలోనేనని ఆరోపించారు. చంద్రబాబు తన గురువని రేవంత్‌ అంటారని, మరోసారి ఆయనను తన గురువంటే గుండు మీద తంతానని హెచ్చరిస్తారని, ఇది ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదేనన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కూలినా, వట్టెం పంప్‌హౌస్‌ మునిగినా, ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయడం చేతకాలేదని, ఒక్క ప్రాజెక్టు గానీ, ఒక్క చెరువు కానీ తవ్విన పాపాన పోలేదని, అలాంటివారు నీళ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

అవి కాళేశ్వరం నీళ్లు కావా..?

కాళేశ్వరం లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్‌ 1 చేశామని సీఎం రేవంత్‌ చెప్పడం విచిత్రంగా ఉందని, మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌, అనంతగిరి ప్రాజెక్టుల కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్లతో పండేవి కావా? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి రాకముందే 2022-23లో 258 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి, తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబెట్టింది కేసీఆర్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పాలన చేతగాక కాంగ్రెస్‌ సర్కార్‌ అబద్ధాలతో కాలం గడుపుతోందని, వారి మోసాల పట్ల జనం జాగ్రత్తపడాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 23 , 2025 | 04:14 AM