Harish Rao Questions CM Revanth: రూ.కోటి పరిహారం హామీ ఏమైంది?
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:38 AM
సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామన్న హామీ ఏమైందని, 4 నెలలు గడిచినా ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు...
4నెలలైనా సిగాచి ప్రమాద బాధితులకు న్యాయం జరగలేదు
మీరు చెప్పిన మాటకే విలువ లేదా?
సీఎం రేవంత్‌కు హరీశ్ లేఖ
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామన్న హామీ ఏమైందని, 4 నెలలు గడిచినా ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు... సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. సీఎం మాటలకే విలువ లేకపోతే ఆ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని అడిగారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో 54 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ‘గత 4 నెలల్లో బాధితుల చేతికి అందింది రూ.26 లక్షలే (కంపెనీ ఇచ్చిన రూ.25 లక్షలు+ప్రభుత్వం తరపున ఇచ్చిన రూ.లక్ష). ఒక్కో కుటుంబానికి రూ.74 లక్షలు బాకీ పడ్డారు. కానీ కార్మిక మంత్రి బాధితులకు రూ.40-50 లక్షలు అందించామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎ్‌సఐ, ఇన్సూరెన్స్ డబ్బులు వారి హక్కు. అది మీ భిక్ష కాదని గుర్తుంచుకోండి. ఆ డబ్బులూ మీరిచ్చే నష్టపరిహారంలో కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమ’ని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా బాధితులకు అందలేదన్నారు.
కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట: హరీశ్
ఫార్ములా ఈ రేస్‌పై కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని, అక్రమ కేసులతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఆరోపించారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై స్పందిస్తూ రేవంత్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. కాగా, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వందో ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేటీఆర్, హరీశ్ ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.