BRS leader Harish Rao: హరీశ్.. వర్క్ ఫ్రం హోం
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:10 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకోవడం బీఆర్‌ఎ్‌సకు ప్రతిష్ఠాత్మకంగా మారింది...
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకోవడం బీఆర్‌ఎ్‌సకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో విజయ సాధనకు పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో.. ఏ ఎన్నికల్లోనైనా పార్టీలో కీలక పాత్ర పోషించే దీటైన వ్యూహకర్త.. తాను స్వయంగా విజేతగా నిలవడంతో పాటు తమ అభ్యర్థులను సైతం గెలిపించుకోవడంలోనూ చాతుర్యం చూపే మాజీ మంత్రి హరీశ్‌రావు ఈసారి ప్రచారం రంగంలో లేకపోవడం పార్టీకి లోటుగా మారింది. కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నేరుగా ప్రచారంలో పాల్గొనలేక పోయినా.. కొద్ది రోజులు గడవడంతో.. ఒకవైపు తనను పరామర్శించేందుకు వచ్చేవారితో మాట్లాడుతూ.. మరోవైపు తన ఇంట్లోనే ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు. పార్టీ నిర్వహించిన, ఇతరులు చేసిన సర్వేల సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ ఎక్కడ, ఎందుకు వెనుకబడి ఉందో అంచనా వేస్తున్నారు. ప్రతి 100 ఓట్లకు ఓ ప్రతినిధిని, వారితో సమన్వయానికి పోలింగ్‌బూత్‌లు, డివిజన్ల వారీగా స్థానిక సీనియర్ నేతలను పార్టీ నియమించింది. వీరందరినీ సమన్వయం చేసుకొని ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. హరీశ్‌రావు తనవద్ద ఉన్న సమాచారం ఆధారంగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ దశ దిన కర్మ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి హరీశ్ ప్రచార పర్వంలోకివస్తారని పార్టీశ్రేణులు పేర్కొంటున్నాయి.