Share News

Quash Petition: క్రిమినల్‌ కేసులు కొట్టేయాలని హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్లు

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:58 AM

తనపై నమోదైన మూడు క్రిమినల్‌ కేసులు కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Quash Petition: క్రిమినల్‌ కేసులు కొట్టేయాలని హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన మూడు క్రిమినల్‌ కేసులు కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. గతేడాది ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని, ఒట్టు వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగకూడదని కోరుతూ హరీశ్‌రావు యాదగిరిగుట్ట ఆలయంలో పాప పరిహార పూజలు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కార్యక్రమంలో భాగంగా పూజలు చేయడం సమంజసం కాదని ఈవో భాస్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరీశ్‌తోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. పోలీసులు, ఈవో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ తదిపరి విచారణను అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది. హరీశ్‌రావు, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ చక్రధర్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీనిపై దాఖలైన క్వాష్‌ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన ఇదే ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నాయకుడు మెట్టు సాయి చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌లో దాఖలైన కేసు కొట్టివేయాలని ఇంకో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయి.. ట్రయల్‌ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలైనందున, ఆ ఛార్జిషీట్‌ను సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ వేసుకోవాలని హైకోర్టు సూచించింది.

Updated Date - Sep 19 , 2025 | 07:40 AM