Former minister Harish Rao: రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడం
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:57 AM
ఇప్పటికే రేవంత్‌రెడ్డి తనపై లెక్కలేనని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటా లీకులు ఇస్తున్నారు...
ఫోన్ ట్యాపింగ్‌పై నోటీసులిచ్చినా లెక్క పెట్టం
ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు
కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం
మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ‘‘ఇప్పటికే రేవంత్‌రెడ్డి తనపై లెక్కలేనని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటా లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా.. మాపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. నోటీసులు, కేసులను లెక్కపెట్టేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి వాస్తు భయం పట్టుకొందని, అధికారంలోకి వచ్చాక గేట్లు, రూట్లు మార్చినా కలిసిరాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలె్‌సలో లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే.. రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. తప్పు చేసినందునే సీఎం సహా అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు, మూడు రోజులకే పరిమితం చేయకుండా 15 రోజులపాటు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అప్పు ఇప్పించిన మధ్యవర్తికి రూ.180కోట్ల కమీషన్ ఇచ్చామని అసెంబ్లీలోనే చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. పదోన్నతుల కోసం, రేవంత్‌రెడ్డి మెప్పు కోసం... తప్పులు చేస్తే తీవ్రంగా నష్టపోతారని పోలీసులను హెచ్చరించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో పోలీసు అధికారులకు పట్టిన గతే.. వారికీ పడుతుందని అన్నారు.