Share News

Harish Rao: జోర్డాన్‌లో చిక్కుకున్న వలస కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:04 AM

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది వలస కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని మాజీ మంత్రి..

Harish Rao: జోర్డాన్‌లో చిక్కుకున్న వలస కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలి

  • సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చొరవ తీసుకోవాలి: హరీశ్‌రావు

సిద్దిపేట/హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది వలస కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ దేశాల్లో చిక్కుకున్న వలస కార్మికుల ఆవేదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వలసలు వాపస్‌ అయితే, ఇప్పడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు? సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చొరవ చూపి జోర్డాన్‌లో ఉన్న కార్మికులను వెంటనే తెలంగాణకు రప్పించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 03:04 AM