Harish Rao: రేవంత్‌ది ల్యాండ్ లూటింగ్ పాలసీ
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:08 AM
రాష్ట్రంలోని పారిశ్రామిక భూములను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెవేటు వ్యక్తులకు తెగనమ్ముతున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
ఆయన ఎనుముల కాదు.. అమ్మకాల రేవంత్‌రెడ్డి
రూ.5 లక్షల కోట్ల భూములు.. రూ.5 వేల కోట్లకు అమ్మకమా?
ఇది మీ అయ్య జాగీర్ కాదు.. బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదు
బీఆర్‌ఎస్ నేత హరీశ్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పారిశ్రామిక భూములను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెవేటు వ్యక్తులకు తెగనమ్ముతున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన పేరు ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ కాదు.. హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వమయితే, కాంగ్రెస్‌ది అమ్మకాన్ని పెంచిన ప్రభుత్వమని హరీశ్‌రావు విమర్శించారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 9,292 ఎకరాల పారిశ్రామిక పార్కుల భూముల విలువ రూ.5 లక్షల కోట్లు అయితే.. వాటిని రూ.5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. మిగతా రూ.4.95 లక్షల కోట్లు కుంభకోణం కాదా? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి? అని నిలదీశారు. 9,292 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీలు పోగా 4,740 ఎకరాలే ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈ కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికమని తెలిపారు. ఈ అంశ ంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయమా?
టీజీఐఐసీ రేటును పక్కనబెట్టి, భూమి ఎస్‌ఆర్‌వో రేటులో 30 శాతం కడితే చాలు అని రేవంత్ ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌వో ధరలు తక్కువగా ఉన్నాయి.. త్వరలో పెంచుతామని ప్రకటనలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పెంచలేదు. ముందుగా ఓఆర్‌ఆర్ లోపల, ఆ తర్వాత బయట పెంచుతామన్నారు. అది అమలులోకి రాకముందే ఈ పాలసీని ఎవరి మేలు కోసం తెచ్చారు? పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, పేదలకు ఒక విధానమా? సవరించిన భూముల రేట్లు కేవలం పేదలకేనా? పేదవాడు కొన్న భూమికిఎ్‌సఆర్‌వోపై 60 - 80 శాతం ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేశారు. ఇప్పుడు 30 శాతానికే పారిశ్రామిక భూములను మల్టీపుల్ జోన్‌గా మారుస్తున్నారు. పేదవాడికి ఒక న్యాయం.. పెద్దోడికి ఒక న్యాయం ఉంటదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దేశంలో ఇంత పెద్ద కుంభకోణం మరొకటి లేదని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఇది మీ అయ్య జాగీర్ కాదు. నాలుగు కోట్ల ప్రజల ఆస్తి. మీరు ఇష్టం వచ్చినట్లు అమ్ముతామంటే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు’ అని హెచ్చరించారు.