Share News

Former Minister Harish Rao: రేవంత్‌ కమీషన్ల కోసమే రూ.2.50 లక్షల కోట్ల టెండర్లు..

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:31 AM

కమీషన్లు దండుకోవడం కోసం వివిధ పనులకు రూ.2.50 లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. విద్యార్థుల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ..

Former Minister Harish Rao: రేవంత్‌ కమీషన్ల కోసమే రూ.2.50 లక్షల కోట్ల టెండర్లు..

  • ఫీజు రీయింబర్స్‌ బకాయిలపై సర్కారు మొద్దు నిద్ర: హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు దండుకోవడం కోసం వివిధ పనులకు రూ.2.50 లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. విద్యార్థుల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుబాట పేరిట పీబీఎ్‌సయూ రూపొందించిన బిగ్‌ డిబేట్‌ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్‌ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం వల్ల అన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్‌ ఏం చేస్తున్నారో.. అర్థం కావడం లేదు’ అని విమర్శలు గుప్పించారు. సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీసిన హరీశ్‌.. అల్లరి చేయొద్దని ఆర్థికమంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదని వ్యాఖ్యానించారు. చేతగాని విధానాల వల్ల విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంటే రేవంత్‌ మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు పెరిగారని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఇప్పటికైనా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని.. లేదంటే విద్యా రంగ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ మరో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Updated Date - Sep 15 , 2025 | 05:32 AM