Share News

Harish Rao : సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

ABN , Publish Date - Mar 19 , 2025 | 06:39 AM

: ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను ఎత్తివేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Harish Rao : సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

  • ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి 50 వేల కోట్ల అప్పునకు యత్నం

  • నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి

  • మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను ఎత్తివేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రశ్నోత్తరాలను ఎత్తివేయడంపై స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి అభ్యంతరం తెలిపామని చెప్పారు. ఈ ప్రభుత్వం సర్కార్‌ భూములను తాకట్టు పెట్టి రూ. 50 వేల కోట్ల రూపాయల అప్పు తేవడానికి ప్రయత్నిస్తోందని, దీనిపై ప్రశ్నించడానికి సన్నద్ధమైతే సమాధానం చెప్పలేక తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. హెచ్‌ఎండీఏ భూముల ద్వారా 20 వేల కోట్లు, టీజీఐఐసీ భూముల ద్వారా 10 వేల కోట్లు, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌ భూముల ద్వారా 10 వేల కోట్లు, జీహెచ్‌ఎంసీ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు.. మొత్తం రూ. 50 వేల కోట్లు అప్పు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. సాగునీరు లేక పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, దేవాదుల, మల్లన్న సాగర్‌ ఆయకట్టు కింద ఎండి పొలాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు రైతులు పంటను అమ్ముకుని నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

Updated Date - Mar 19 , 2025 | 06:40 AM