Harish Rao: గురుకుల నిత్యావసర బిల్లుల పెండింగ్ సిగ్గుచేటు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:37 AM
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు..
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. గురుకులాల నిత్యావసరాల సరఫరా కాంట్రాక్టర్లు ఆదివారం హరీశ్‌ను ఆయన నివాసంలో కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. బకాయిల చెల్లింపు విషయమై తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలకు నిత్యావసర వస్తువులెలా సరఫరా చేస్తారని, విద్యార్థులకు నాణ్యమైన భోజనమెలా అందుతుందని ప్రశ్నించారు. విద్యార్థులు పస్తులుండొద్దన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పు చేసి మరీ నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని.. సకాలంలో బిల్లులు రాక వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ ఆహారంతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిచి.. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనమందేలా చూడాలని హరీశ్ డిమాండ్ చేశారు.