Share News

Harish Rao: కుర్చీ పోతుందని రేవంత్‌కు భయం!

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:01 AM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి అసహనం పెరిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రె్‌సపై ప్రజల్లో...

Harish Rao: కుర్చీ పోతుందని రేవంత్‌కు భయం!

  • పంచాయతీ ఫలితాలతో సీఎంకు తీవ్ర అసహనం

  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ వచ్చింది.. కష్టాలు తెచ్చింది: హరీశ్‌

హైదరాబాద్‌/మెదక్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి అసహనం పెరిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రె్‌సపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా పంచాయతీ ఫలితాలు రావడంతో రేవంత్‌ చాలా చిరాగ్గా ఉన్నారని ఆరోపించారు. తమ పతనం తప్పదన్న విషయం అర్థమై ఆగమాగం అవుతున్నారన్నారు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, దోపిడీ ఆగిపోతుందని రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని.. అందుకే మీడియా ముందు అడ్డగోలుగా వాగారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకనే ఆయన అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. తనకు, కేటీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించాలని, తద్వారా బీఆర్‌ఎ్‌సను బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసం చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆయన కుట్రలు, కుతంత్రాలు ఫలించవని పేర్కొన్నారు. ‘ఎన్నోసార్లు చెప్పా. మళ్లీ చెబుతున్నా. రేవంత్‌రెడ్డీ రాసిపెట్టుకో. ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే. నా చేతిలో ఉండేది గులాబీ జెండానే . నీ దాష్టీకాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా నేను, కేటీఆర్‌ కలిసి మరింత సమర్థంగా పోరాడతాం’ అని హరీశ్‌ చెప్పారు. ఉద్యమకాలం నుంచి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కాంగ్రె్‌సను గద్దె దించడమే తమ లక్ష్యమని తెలిపారు. చిల్లర రాజకీయాలు మానుకొని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. లేకపోతే అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది.. ప్రజలకు కష్టాలను తెచ్చిందని చెప్పారు. మెదక్‌ జిల్లా రైతులు యాసంగి పంట వేయాలా? వద్దా? అనే దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు బోర్లు వేయలేదని, కాంగ్రెస్‌ వచ్చాక బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 19 , 2025 | 05:01 AM