Harish Rao Criticizes Bhatti Vikramarka: భట్టిలా కమీషన్లు తీసుకోవడంలో నేను అన్‌ఫిట్
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:14 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాదిరిగా బిల్లుల మంజూరుకు 20-30 శాతం కమీషన్లు తీసుకోవడంలో తాను అన్‌ఫిట్ అని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యానించారు...
విద్యుత్ శాఖలోని కీలక పోస్టుల్లో ఆంధ్రా వ్యక్తులు
వారి కోసం తెలంగాణ ఉద్యోగులను బలి చేస్తున్నారు
కాంగ్రె్‌సది ప్రజా పాలన కాదు.. ద్రోహ పాలన: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాదిరిగా బిల్లుల మంజూరుకు 20-30 శాతం కమీషన్లు తీసుకోవడంలో తాను అన్‌ఫిట్ అని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హరీశ్‌రావు అన్‌ఫిట్ అంటూ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఆర్థికశాఖ మంత్రిగా పని చేసినప్పుడు కమీషన్లు తీసుకోవడం తనకు రాలేదన్నారు. ఫ్రస్ర్టేషన్‌లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని భట్టిని హెచ్చరించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో 50వేలకోట్ల కుంభకోణం ఉందని తాను ఆరోపిస్తే.. దానిపై వివరణ ఇవ్వకుండా తన స్థాయిని దిగజార్చుకొని విమర్శలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం నిర్మించిన ప్లాంట్ నుంచి 2400 మెగావాట్ల కరెంటును తీసుకోవాలని, రూ.4.12కు యూనిట్ కరెంట్ ఇస్తామని ప్రభుత్వానికి ఎన్‌టీపీసీ లేఖ రాసిందని తెలిపారు. కానీ.. కమీషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడుతోందన్నారు. ఒక వేళ అప్పులు తెచ్చి కొత్త ప్రాజెక్టులు పూర్తిచేసినా.. విద్యుత్‌ప్లాంట్ల ఒప్పందం ప్రకారం 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.82,000కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్‌శాఖలోని కీలక విభాగాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను వరుసగా నియమించడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ అందిస్తున్నది ప్రజాపాలన కాదని.. తెలంగాణ ద్రోహ పాలన అని విమర్శించారు. ఏపీకి చెందిన రాజశేఖర్‌రెడ్డిని జెన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్‌గా, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులను అవహేళన చేసిన కుమార్‌రాజాను ఉద్యోగుల డైరెక్టర్‌గా, మధ్యప్రదేశ్‌లో మైనింగ్ ఇంజనీర్‌గా పని చేసిన శివాజీని ఎస్పీడీసీఎల్‌లో ప్రాజెక్టు హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా, ఏపీకి చెందిన నరసింహులును ఎస్పీడీసీఎల్ ఆపరేషనల్ డైరెక్టర్‌గా, వావిలాల అనిలను రెడ్కో సీఎండీగా, ఏసీబీ కేసులో ఉన్న నందకుమార్‌ను చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఆంధ్రా వారి కోసం తెలంగాణ ఉద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రీన్‌ఎనర్జీ పాలసీలో భాగంగా పారిశ్రామిక వేత్తలు ఎక్కడి నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి వాడుకునేందుకు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం.. అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందని దుయ్యబట్టారు. మెగావాట్‌కు రూ.20లక్షలు, పైనున్నవారికి మరో 10లక్షల చొప్పున చీఫ్ ఎలక్ర్టికల్ ఇన్‌స్పెక్టర్ లంచం అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆంధ్రా అధికారుల దోపిడీకి ఇదొక నిదర్శమని.. పంచాయతీ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలకు వెళ్తూ కోడ్ ఉల్లంఘిస్తుంటే.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిద్రపోతుందా? అని నిలదీశారు. కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.