Former minister Harish Rao: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ కల సాకారం
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:18 AM
కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబరు 9....
మన బిడ్డలను జైల్లో పెట్టిన ట్రంప్ పేరును ఇక్కడి రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబరు 9న అప్పటి యూపీఏ సర్కారు తెలంగాణపై ప్రకటన చేసి ఉండేది కాదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే 24 గంటల కరెంటు, ఇంటింటికీ నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైందని గుర్తు చేశారు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్‌రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. అభివృద్ధి బాటలో నడుస్తున్న తెలంగాణను సమైక్యవాదులతో కలిసి వెనుకబడేసే కుట్రకు సీఎం రేవంత్ తెరలేపారని ధ్వజమెత్తారు. సీఎం హోదాలోనూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, కాళోజీ, దాశరథి, గద్దర్‌ను తక్కువ చేసి మాట్లాడారని దుయ్యబట్టారు. పన్నులు పెంచి, వీసాలు కఠినతరం చేసి, అమెరికాలో తెలుగు పిల్లలకు బేడీలు వేసి ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటన్నారు. కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే(14న) ఏపీపీ పరీక్షలు నిర్వహించడం తగదని, తక్షణం వాయిదా వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.