Former minister Harish Rao: బీసీల ఆత్మగౌరవ భవనాలకు రేవంత్ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:11 AM
బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం విలువైన భూములు కేటాయించినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
వడ్డెరల అభివృద్ధి బీఆర్‌ఎస్ బాధ్యత: హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం విలువైన భూములు కేటాయించినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఆ నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పనులకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, వడ్డెరలకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అందుకే వారు అడగకపోయినా హైదరాబాద్‌లో ఆ సంఘం భవన నిర్మాణానికి ఎకరం భూమి కేటాయించడంతో పాటు నిధులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలన ‘ఇంట్లో ఈగలమోత.. బయట పల్లకిల మోత’ అన్నట్లుగా మారిందని, పంపకాల్లో తేడావచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని విమర్శించారు. వాటాలు పంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ విజయయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలని, కారుకు ఓటేసి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.