Former minister Harish Raoమోసంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:17 AM
ప్రజలను మోసగించడంలో పోటాపోటీగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు.. నాణానికి బొమ్మ బొరుసు వంటివని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు....
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్ని నిలదీయండి: హరీశ్
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజలను మోసగించడంలో పోటాపోటీగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు.. నాణానికి బొమ్మ బొరుసు వంటివని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీతో పైకి కొట్టుకున్నట్లు కనిపిస్తున్న ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ఒక్కటిగా పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు బీజేపీ రక్షణగా నిలుస్తోందని పేర్కొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పలువురు తునికి గ్రామ కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరీశ్.. వారికి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో పండించే గోధుమలకు తెలంగాణలో పండించే వరి ధాన్యం మద్దతు ధర కంటే రూ.216 ఎక్కువ ప్రకటించారని, దీనివల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రం మీదుగా వెళ్లే గోదావరి నదీ పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లు కేటాయించిన కేంద్రం.. 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆ ప్రజలకే బాకీ పడిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని బీఆర్‌ఎస్ శ్రేణులను హరీశ్ కోరారు.
పిల్లలకు పురుగుల్లేని అన్నం పెట్టండి
ప్రభుత్వ బడుల్లో చదివే పేదలకు సరైన అన్నం పెట్టని ఈ సీఎం వల్ల లాభమేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకేనని హెచ్చరికలు జారీ చేసిన సీఎం.. ఇప్పటి వరకు కల్తీ ఆహారం పెట్టిన ఎంత మందిని జైలుకు పంపారో సమాధానమివ్వాలని శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు విద్యార్థులకు పురుగుల్లేని అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు.