Former minister Harish Rao accused: నిమ్మకు నీరెత్తినట్టుగా సీఎం రేవంత్ తీరు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:17 AM
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు పెనుప్రమాదంగా మారుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ....
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు పెనుప్రమాదంగా మారుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ పురోగతిలో ఉందని, పీఎ్‌ఫఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ విషయమై గత నెలలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని వెల్లడించారు. 20 రోజులైనా ముఖ్యమంత్రి వ్యతిరేకించకుండా ఏపీకి సహకరిస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం రాష్ట్రాన్ని సీఎం తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ గోదావరి నీళ్లు తీసుకెళ్తే తాము కృష్ణాలో 112 టీఎంసీల నీటిని వాడుకుంటామని కర్ణాటక, వరద జలాల ఆధారంగా తామూ ప్రాజెక్టులు కట్టి 74టీఎంసీలు వినియోగించుకుంటామని మహారాష్ట్ర కేంద్రానికి లేఖలు రాశాయని వెల్లడించారు. బనకచర్ల డీపీఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం రూ.9కోట్లతో టెండర్లు పిలిచిందని తెలిపారు. ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. తక్షణమే అప్రైజల్, డీపీఆర్ తయారీని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, సుప్రీం కోర్టులో పోరాడి రాష్ట్ర హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.