Share News

Harish Rao: రేవంత్‌ సొంత లాభం కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:29 AM

సొంత లాభం కోసం సీఎం రేవంత్‌రెడ్డి వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గాన్ని అష్టవంకరలు తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం..

Harish Rao: రేవంత్‌ సొంత లాభం కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : సొంత లాభం కోసం సీఎం రేవంత్‌రెడ్డి వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గాన్ని అష్టవంకరలు తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం రేవంత్‌ ఇంటి వ్యవహారం కాదని, రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టే చర్యలు ఆపకపోతే బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చి తమ కడుపు కొడుతున్నారంటూ సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం హరీశ్‌రావును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. పాత అలైన్‌మెంట్‌ కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కాంగ్రెస్‌ నేతల భూములు పోకుండా.. రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా కొత్త అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. కాగా, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌ పాటిస్తున్నాయని, రేవంత్‌ పాలనల అన్నీ బందే అవుతున్నాయని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ చేతగాని పాలన చూసి అన్నివర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారని, రేవంత్‌కు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 05:29 AM