minister komatireddy venkat reddy: హ్యామ్ రోడ్లకు టెండర్లు రేపు
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:50 AM
రహదారులు, భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి, ఉన్నతీకరించాల్సిన రోడ్లకు మంత్రివర్గం...
32 ప్యాకేజీలు, 400 పనులకు ఒకేసారి ఆహ్వానించనున్న ఆర్ అండ్ బీ శాఖ
క్యాబినెట్ ఆమోదం తెలిపిన పనులకు జీవో 70 విడుదల
30 నెలల్లోగా పనులు పూర్తి: కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రహదారులు, భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి, ఉన్నతీకరించాల్సిన రోడ్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన మేర పనులు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 70ను బుధవారం జారీ చేసింది. రూ.10,547 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,566 కి.మీ మేర అభివృద్ధి చేయనున్న రహదారుల వివరాలను అందులో పొందుపరిచింది. దీంతో ఇప్పటికే ఖరారు చేసిన 32 ప్యాకేజీలు, 400 పనులుగా చేపట్టనున్న ఈ పనులకు ఆర్ అండ్ బీ శాఖ శుక్రవారమే టెండర్లు పిలవనుంది. ఆర్ అండ్ బీ చేపట్టే పనుల్లో ఖమ్మం జిల్లాలోని మధిర-కృష్ణాపురం-దెందుకూరు పరిధిలో రూ.193.52 కోట్ల వ్యయంతో 13 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించనున్నారు. అలాగే, నల్లగొండ జిల్లా వైద్య కళాశాల- నల్లగొండ పట్టణ పరిధిలో నాలుగు వరుసల బైపాస్ రోడ్డును రూ.210 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. కాగా, ఆర్ అండ్ బీ శాఖ ఇప్పటికే ఖరారు చేసిన హ్యామ్ రోడ్లను క్యాబినెట్ ఆమోదించడంతో ఆయా పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొత్తం రోడ్లలో 1791 కి.మీ లను రూ.6,152 కోట్ల వ్యయంతో విస్తరించనున్నామని చెప్పారు. మరో 3,775 కి.మీ రోడ్లను రూ.4,395 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నుంచి ప్యాకేజీల వారీగా వచ్చే 30 నెలల్లో పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.