Guwahati Launches Silk Saree: పట్టుచీరల ప్రామాణికతకు మూడు సూత్రాలు!
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:39 AM
వేల రూపాయల ఖరీదు పెట్టి పట్టు చీరలు కొంటాం. అయితే వినియోగదారులు ఆశించే నాణ్య త చాలా ముఖ్యం. నకిలీ పట్టును అసలు పట్టుగా...
రూ. 100 చెల్లిస్తే పట్టు నాణ్యత ధ్రువీకరణ
గువాహటిలో పరీక్షా కేంద్రం ఏర్పాటు
(గువాహటి నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వేల రూపాయల ఖరీదు పెట్టి పట్టు చీరలు కొంటాం. అయితే వినియోగదారులు ఆశించే నాణ్య త చాలా ముఖ్యం. నకిలీ పట్టును అసలు పట్టుగా నమ్మించి మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి ప్రామాణికతను పరీక్షించేందుకు ఇప్పుడు ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాల చేతి వృత్తుల, చేనేత అభివృద్ధి కేంద్రం.. టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన అభ్యర్థుల సహకారంతో అసోం రాజధాని గువాహటిలో దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో కేవలం రూ.100 చెల్లించి, కొనుగోలు చేసిన పట్టుచీర అసలైనదా, కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు. 2023లో దీన్ని ఏర్పాటు చేయగా ఇప్పటిదాకా 30 లక్షలు చీరలకు నాణ్యత సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. చీరల పరీక్ష కోసం మూడు రకాల పద్థతులు పాటిస్తున్నారు. అందులో ఒకటి బర్నింగ్ టెస్ట్. ఈ పద్ధతి లో చీరలోని చిన్న దారాన్ని నిప్పు మీద కాల్చితే వెంట్రుకలు కాల్చినప్పుడు వచ్చే వాసనవస్తే అసలైన పట్టు అని గుర్తిస్తారు. రెండోది సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ముంచి పరీక్ష చేస్తారు. ఈ ఆమ్లంలో పట్టు త్వరగా కరిగిపోతుంది. మూడో విధానంలో చీరను మైక్రో స్కోప్ కింద చూసినప్పుడు చీరలో దారాల అల్లికలు ఒకే మందంతో, సమాంతరంగా.. నునుపుగా కనిపిస్తాయి. ఈ చౌకైన పరీక్షా విధానం ద్వారా పట్టు వ్యాపారంలో పారదర్శకత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.