Share News

kumaram bheem asifabad- కౌటాలలో తుపాకుల కలకలం

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:33 PM

కుమరం భీం జిల్లా కౌటాలలో ఓ వ్యాపారిని తపాకితో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. కౌటాల పోలీసుస్టేషన్‌లో ఎస్పీ నితికా పంత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు

kumaram bheem asifabad- కౌటాలలో తుపాకుల కలకలం
కుమరం భీం జిల్లా కౌటాల పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

వివరాలు వెల్లడించిన కుమరం భీం జిల్లా ఎస్పీ నితికా పంత్‌

కౌటాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కౌటాలలో ఓ వ్యాపారిని తపాకితో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. కౌటాల పోలీసుస్టేషన్‌లో ఎస్పీ నితికా పంత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. కౌటాల మండలం కౌటి(సాండ్‌గాం)కు చెందిన కుర్బంకర్‌ అజయ్‌(31) అనే యువకుడు సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో హిందీ సినిమాతో ప్రేరణ పొందాడు. బాగా డబ్బు ఉన్న వారిని బెదిరించి అవసరమైతే చంపి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడది జూన్‌ 11వ తేదీన రాత్రి బెదిరిస్తూ కౌటాలకు చెందిన ఓ వ్యాపారికి లేఖలు రాశాడు. రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేకుంటే నీ కుటుంబ సభ్యులను చంపుతానని రెండు లేఖలు రాసి సదరు వ్యాపారి ఎరువుల దుకాణం వద్ద పెట్టాడు. కానీ ఆ వ్యాపారి స్పందిచక పోవడంతో యూట్యూబ్‌లో చూసి పిస్టల్‌, తపంచా లాంటి మారణాయుధాలు బిహార్‌లో దొరుకుతాయని తెలుసుకున్నాడు. జూలై చివరి వారంలో బిహార్‌ వెళ్లి ఆగస్టు మొదటి వారం వరకు అక్కడే ఉన్నాడు. బాబు సాహెబ్‌ అనే వ్యక్తి దగ్గర రూ. 55 వేలు చెల్లించి ఒక తుపాకి, రెండు మ్యాగజిన్లు, దీనికి సంబంధిచిన 20 బుల్లెట్లు, ఒక తపంచ, దీనికి సంబంధించిన ఒక బుల్లెట్‌ కొనుగోలు చేసి అక్కడే షూటింగ్‌ నేర్చుకున్నాడు. మూడు బుల్లెట్లు అక్కడే ప్రాక్టీస్‌లో ఉపయోగించాడు. ఇంటికి చేరుకున్న అనంతరం ప్రాణహిత నది ఒడ్డున ఒక బుల్లెట్‌ గాలిలోకి ఫైర్‌ చేసి ప్రాక్టీస్‌ చేశాడు. సెప్టెంబరు 26న కాగజ్‌నగర్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్లే రైలు ఎక్కి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ తీసుకుని డబ్బులు ఇవ్వాలని మళ్లీ ఎరువుల వ్యాపారికి కుర్బంకర్‌ అజయ్‌ ఫోన్‌ చేశాడు. అప్పటికీ ఆ వ్యాపారి స్పందించక పోవడంతో అక్టోబరు 15వ తేదీన రాత్రి సమయంలో వ్యాపారి తమ్ముడిని చంపాలనే ఉద్దేశంతో తుపాకిలో రెండు బుల్లెట్లు నింపుకున్నాడు. వ్యాపారి తమ్ముడు ఇంటికి వెళ్లే మార్గమధ్యలో వేచి ఉన్నాడు. వ్యాపారి తమ్ముడు రాగానే అతడి ముఖంపై లైట్‌ ఫోకస్‌ పెట్టి ఒక బుల్లెట్‌ ఫైర్‌ చేశాడు. గురి తప్పడంతో అక్కడి నుంచి కుర్బంకర్‌ అజయ్‌ పారిపోయాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సదరు వ్యాపారిని ఎరువుల దుకాణంలోనే హతమార్చాలనే ఉద్దేశంతో తుపాకితో పాటు మూడు బుల్లెట్లు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో ఎన్నికల సందర్భంగా తనిఖీ చేస్తున్న పోలీసు లకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి ఒక తుపాకి, ఒక తపంచా(దేశి కట్ట), రెండు మ్యాగజిన్‌లతో పాటు 15 చిన్న బుల్లెట్లు, సెల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. దర్యాప్తునకు కృషి చేసి కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌, కాగజ్‌నగర రూరల్‌ ఎస్సై సందీప్‌, పోలీసు సిబ్బంది రమేశ్‌, సాయిరాజ్‌, దుర్గప్రసాద్‌, దీపక్‌ను ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్‌ అభినందించారు.

Updated Date - Dec 02 , 2025 | 10:33 PM