Police Investigation: 2 గంటల్లోనే.. ప్రాణాలు బుగ్గిపాలు
ABN , Publish Date - May 22 , 2025 | 05:33 AM
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. కార్మికుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, నష్టంపై అధికారులు సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
టెర్ర్‌స్‌పై పడుకున్న కార్మికులు
వాంగ్మూలాలు నమోదు
‘గుల్జార్ హౌజ్’ ఘటనపై కొనసాగుతున్న విచారణ
హైదరాబాద్ సిటీ/చార్మినార్, మే 21 (ఆంధ్రజ్యోతి): గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద ఘటనలో నలుగురు కార్మికులను చార్మినార్ పోలీసులు విచారించినట్లు తెలిసింది. సౌత్‌జోన్ డీసీపీ స్నేహ మెహరా, ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. నలుగురు కార్మికుల్లో ముగ్గురు టెర్రస్ పైన, ఒకరు బయట గేటు వద్ద పడుకున్నట్లు గుర్తించారు. వీరి వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో ఏసీ కంప్రెషర్ పేలి అగ్గి రాజుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు, పొగ వ్యాపించిన విషయాన్ని నిద్రలో ఉన్న ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు గుర్తించడానికి సుమారు 45-50 నిమిషాలు పట్టినట్లు పేర్కొంటున్నారు. అప్పటికే పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో తెలియక హాహాకారాలు చేసినట్లు తెలిసింది. వారి అరుపులతో కార్మికులు నిద్ర లేచారు. దట్టమైన పొగలు వస్తుండడంతో ఏం జరుగుతుందో తమకు అర్థం కాలేదని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. వెంటనే అత్తాపూర్‌లో ఉంటున్న ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని కార్మికులు చెప్పినట్లు సమాచారం. ఉదయం 6.15 గంటల సమయంలో స్థానికులు, టెర్ర్‌స్‌పై ఉన్న కార్మికులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. అయితే టెర్రస్ గేటు తాళం కార్మికుల వద్ద ఉందా? యజమానుల వద్ద ఉందా? అన్నది తెలియడం లేదు. 6.20 గంటలకల్లా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే విపరీతంగా పొగపీల్చిన బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. మిగిలిన వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు గంటల్లోనే 17 మంది మృతి చెందినట్లు గుర్తించారు. వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలూ తీసుకోనున్నట్లు తెలిసింది.
నష్టంపై అంచనా రాలేదు..
అగ్ని ప్రమాద ఘటనలో వాటిల్లిన నష్టంపై ఉన్నతస్థాయి కమిటీ ఇంకా అంచనాకు రాలేదు. కమిటీ అధికారులు రెండు రోజులుగా తమ విభాగాల సిబ్బందితో క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తూ వివరాలను సేకరిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు బుధవారం మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు దుకాణాల్లో ఆభరణాలు ఎన్ని ఉన్నాయి? ఇంట్లో ఏమేం వస్తువులు కాలిపోయాయి? నగదు ఏమైనా ఉందా? ఆస్తుల పత్రాలు ఉన్నాయా? అనేది క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశిస్తుండడంతో అధికారులు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. దుకాణాల్లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. మరో వారం రోజుల్లో నష్టంపై పూర్తి అంచనాకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యుల్లో కొందరు బుధవారం ప్రహ్లాద్ మోదీ ఇంటికి వచ్చారు. ఘటనపై పోలీసులు, అధికారులు పంచనామా చేసిన తర్వాత కొందరిని ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించారు. ఇంట్లో టార్చిలైట్ల సాయంతో రెండు రోజులుగా సామగ్రిని వెతుకుతున్నారు. వారి షాపుల్లో పనిచేసే కార్మికుల సాయంతో ఒక్కో వస్తువును బయటకు తీసుకొస్తున్నారు. మంటల్లో కాలిపోగా, మిగిలిన వస్తువులను అత్తాపూర్‌లోని కుమార్తె ఇంటికి తీసుకెళ్లారు.