Telangana Deputy CM Bhatti Vikramarka: జీఎస్టీ తగ్గింపుతో 5వేల కోట్ల నష్టం
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:01 AM
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు..
అయినా హేతుబద్ధీకరణకు అనుకూలంగా రాష్ట్ర నిర్ణయం
తగ్గిన ధరలను షాపుల ముందు ప్రదర్శించాలి
ఈ ప్రయోజనాలను ప్రజలకు అందించాలి
వ్యాపారులతో చర్చలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినా పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల మేలు కోసం హేతుబద్ధీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారులతో చర్చా కార్యక్రమంలో తభట్టి మాట్లాడారు. సవరించిన రేట్లతో చాలా వస్తువులు, ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, వ్యాపారులపై ఉందన్నారు. తగ్గిన వస్తువుల ధరలను వ్యాపారులు తమ దుకాణాల ముందు ప్రదర్శించాలని సూచించారు. సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గనుందని, ఫలితంగా సిమెంటు ధరలు మరింత దిగి వస్తాయని చెప్పారు. దీంతో నిర్మాణ రంగం పుంజుకునే అవకాశాలు ఉంటాయన్నారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించడానికి ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయ పెంపుపై నివేదికివ్వండి
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయ పెంపుపై లోతుగా అధ్యయనం చేసి, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖతో ముడిపడి ఉన్న హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హౌజింగ్ బోర్డులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు.