Share News

GST Reforms: పన్ను సరళీకరణ.. అందరికీ ఉపయోగమే

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:04 AM

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన నేపథ్యంలో.. ధరల తగ్గింపుపై కొనుగోలుదారుల్లో చర్చ మొదలైంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను రేట్లపై చాలా సందేహాలు..

GST Reforms: పన్ను సరళీకరణ.. అందరికీ ఉపయోగమే

  • తప్పుడు ఇన్‌వాయి్‌సలు ఇచ్చే వారిని జీఎస్టీ గమనిస్తుంది

  • పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు

  • అందివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు

  • ‘ఆంధ్రజ్యోతి’తో జీఎస్టీ కమిషనర్‌ సాధు నర్సింహారెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన నేపథ్యంలో.. ధరల తగ్గింపుపై కొనుగోలుదారుల్లో చర్చ మొదలైంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను రేట్లపై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నింటినీ ‘ఆంధ్రజ్యోతి’.. సాధు నర్సింహారెడ్డి ముందు ఉంచింది. ఆ సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానాల్లో ముఖ్యాంశాలు..

సాధారణ వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణలతో నేరుగా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ధరలు తగ్గుతాయా?

గతంలో జీఎస్టీ వస్తువులు లేదా సేవలను వాటి కోడ్‌లు, పేర్లతో చూసేవారు, కానీ ఈ సంస్కరణలలో వాటిని రోజువారీ వినియోగ వస్తువుల కోణంలో క్రోడీకరించారు. మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా పేదలు వినియోగించే వస్తువులు, రైతులను ప్రభావితం చేసే వస్తువులపై ఎక్కువగా దృష్టిసారించారు. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశ నుంచి వికసిత్‌ భారత్‌ దిశగా వెళ్లేందుకు కొత్త పన్ను రేట్లు దోహదపడే అవకాశముంది. టూత్‌పేస్ట్‌ నుంచివెన్న, జు న్ను, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాస్తా, ప్యాక్‌ చేసిన కొబ్బరి నీళ్లు, గింజలు, ఖర్జూరాలు, సాస్‌లు, ఎయిర్‌ కండిషనర్లు, టీవీ సెట్‌లు, చిన్న కార్లు, బైక్‌లు, బ్యాండేజీలు, డయాగ్నస్టిక్‌ కిట్‌లు వంటివాటి దాకా వినియోగ వస్తువులపై తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఇవన్నీ ప్రజలకు నేరుగా పన్ను ప్రయోజనాలు అందించేవే.


పన్ను తగ్గింపు ప్రయోజనాలు పరిశీలించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

కొత్త ధరలు సెప్టెంబరు 22 నుంచి అమలయ్యేలా కంపెనీలు తమ వ్యవస్థల్లో మార్పులు చేయాలి. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తున్నారు. పన్నుల తగ్గింపునకు ముందు, తరువాత ధరల స్థితిని జీఎస్టీ విభాగం నిశితంగా పరిశీలిస్తోంది. తగ్గిన పన్ను ప్రయోజనాలు వినియోగదారులకు అందివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

రిటైల్‌ వ్యాపారులు పాత బిల్లులతో అంటే 28 శాతం బిల్లుల ఇన్‌పుట్‌ సరుకు లేకుండా తీసుకుని.. సెప్టెంబరు 22 తరువాత వాడుకునే అవకాశముందా?

పన్ను చెల్లింపుదారులు వస్తువులు లేదా సేవల వాస్తవ సరఫరా లేకుండా పన్ను ఇన్వాయిస్‌ జారీ చేస్తుంటే అవి నకిలీ ఇన్వాయి్‌సలు అవుతాయి. అటువంటి ఇన్వాయి్‌సలను గ్రహీతలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందలేరు.


చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు ఈ పన్నుల తగ్గింపు ఉపయోగపడుతుందా?

ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించడం, వేగవంతమైన పన్ను వాపసు ద్వారా దేశీయ డిమాండ్‌ను పెంచడం వల్ల.. ఎంఎస్‌ఎంఈ నిర్వాహకులకు ప్రయోజనాలు కలుగుతాయి. వారిలో మరింత పోటీతత్వం పెరుగుతుంది.

ఎంత మంది స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తారు?

పన్ను రేట్లను తగ్గించడం సాధారణంగా పన్ను సమ్మతి ని మెరుగుపరుస్తుంది. పన్ను రిటర్నుల్లో నిజాయితీని పెం చుతుంది, ఎగవేతలను తగ్గిస్తుంది.

ఏయే రంగాలపై ప్రభావం ఎక్కువ?

రూ.2,500 కంటే ఎక్కువ విలువైన వస్త్రాల ఖరీదు మరింత పెరుగుతుంది. ఎంఎంఎఫ్‌ ఫైబర్‌, నూలుపై పన్నును 18శాతం, 12శాతం నుంచి5శాతానికి తగ్గించడం వల్ల వేలాది మంది స్పిన్నర్లు, నేత కార్మికుల మూలధన పెట్టుబడి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎంఎస్‌ఎంఈ రంగంలో 70శాతం-80శాతం వస్త్ర, దుస్తుల యూనిట్లు ఉన్నందున, ఆర్థిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది.


ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందా?

2023-24 జీఎస్టీ ఆదాయ వివరాల ఆధారంగా.. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ పన్నుల హేతుబద్థీకరణ నికర ఆర్థిక ప్రభావం రూ.48,000 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అం చనా వేసింది. దీనిపై ఎస్‌బీఐ నివేదిక, హెచ్‌ఎ్‌సబీసీ ఇచ్చిన నివేదిక.. రెండూ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వం స్వల్పకాలిక ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పాయి. అయితే వినియోగం పెరగడం ద్వారా పన్నుల చెల్లింపుల శాతం పెరుగుతుందని సూచించాయి.

భవిష్యత్తులో మరోసారిశ్లాబులు మారే అవకాశం ఉందా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరోక్ష పన్నుల విధానంలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ.. జీఎస్టీ. పన్నుల వ్యవస్థను పర్యవేక్షించడం ద్వారా అవసరమైన సమయంలో మార్పు లు తీసుకురావడం అనేది నిరంతర ప్రక్రియ. ద్రవ్యోల్బణం, పన్నుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పరిమితిని సమీక్షించాల్సిన అవసరం ఉంది.

ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రభావం ఎంత?

రోజువారీ వస్తువులపై తక్కువ పన్ను విధించడంతో, అమ్మకాల పరిమాణం పెరుగుతుంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీ లు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్‌ రంగంలో.. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, విడిభాగాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే టాటా మోటార్స్‌ తన కార్ల ధరలను రూ.1,55,000 వరకూ తగ్గించింది. జీఎస్టీ తగ్గింపుతో.. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో దేశీయ ఉత్పత్తి మెరుగవుతుంది.

Updated Date - Sep 07 , 2025 | 04:07 AM