Temples Have Received GST Notices: ఆలయ ఆదాయం నుంచి జీఎస్టీ కట్టాల్సిందే!
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:23 AM
ఇష్టదైవానికి భక్తితో అర్చన, అభిషేకం, ఇతర ప్రత్యేక పూజలు చేయించినా... కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం కొనుగోలు చేసి తీసుకెళ్లినా...
రాష్ట్రంలోని పలు ఆలయాలకు నోటీసులు జారీ
అర్చన, అభిషేకం, వసతి గృహాలు, షాపుల అద్దెలు, ప్రసాదాలు, తలనీలాల విక్రయంపై పన్ను విధింపు
గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న బకాయిలు
మినహాయింపు కోరుతున్న దేవాదాయ శాఖ
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇష్టదైవానికి భక్తితో అర్చన, అభిషేకం, ఇతర ప్రత్యేక పూజలు చేయించినా... కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం కొనుగోలు చేసి తీసుకెళ్లినా... జీఎస్టీ చెల్లించాల్సిదేనట. ఈ మేరకు తెలంగాణలోని అన్ని ప్రముఖ ఆలయాలకు సంబంధిత అధికారులు వరుసగా నోటీసులు పంపుతుండడంతో దేవాదాయ శాఖ అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. యాదగిరి గుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమరవెల్లి మల్లన్న, బాసర సరస్వతి ఆలయాలతోపాటు మరికొన్ని చిన్న ఆలయాలకు ఈ తరహా నోటీసులు జారీ అయ్యాయి. అర్చన, అభిషేకం వంటి ఆర్జిత సేవలు, ఆలయాల వద్ద గదులు, వ్యాపార సముదాయాలు అద్దెకు ఇవ్వడం, ప్రసాదాల విక్రయం, ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వెండి, బంగారు ప్రతిమల విక్రయం తదితర మార్గాల్లో ఆలయాలకు ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంపైనే జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధానం అమలులో ఉన్నప్పుడు ఆలయాలకు మినహాయింపు ఉండేది. 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, ఆలయాలకు వచ్చే ఆదాయంపైనా పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ నుంచి ఆలయాలను మినహాయించాలని స్థానిక అధికారులు పలుమార్లు కోరినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక్కో ఆలయం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలపై అప్పీలుకు వెళ్లాలన్నా.. విధించిన జీఎస్టీపై 10ు ఫీజు చెల్లించాల్సి ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు సాహసించడం లేదు. ‘‘భక్తులు హుండీలో వేసే కానుకలు, విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. ఆర్జిత సేవలు, గదులు, వ్యాపార సముదాయాల అద్దె, కొబ్బరి చిప్పల విక్రయం తదితరాలపై కేంద్రం జీఎస్టీ విధిస్తోంది. ఆలయ నిర్వహణ, పలు నిర్మాణాలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలోనే జీఎస్టీ చెల్లిస్తున్నాం. మరోసారి ఆలయ ఆదాయంపై జీఎస్టీ విధించడం సరికాదు. జీఎస్టీపై అప్పీలుకు వెళ్దామన్నా.. 10ుఫీజు చెల్లించాల్సి ఉండడం ఆర్థికంగా భారంగా మారింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటే భక్తులకు మేలు జరుగుతుంది’’ అని దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలకూ పన్ను విధించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.