TSPSC: రేపటి నుంచి గ్రూప్-2 ధ్రువపత్రాల పరిశీలన
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:28 AM
గ్రూప్-1 పరీక్ష న్యాయవివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రూప్-2 నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్ష న్యాయవివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రూప్-2 నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. గ్రూప్-1 నియామకాలు పూర్తయిన తర్వాతే గ్రూప్-2, 3 నియామకాలు భర్తీ చేయాలని కమిషన్ భావించింది. అయితే, ఇప్పుడు గ్రూప్-1 ఎంపిక జాప్యం కారణంగా ఇతర నియామకాలు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది జాబితాకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 23, 24 తేదీలలో ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆలా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఉదయం 10:30నుంచి సాయంత్రం 5 వరకు పరిశీలన కొనసాగనుంది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ ప్రక్రియ జరుగుతోంది. గత డిసెంబరు 15, 16 తేదీల్లో జరిగిన పరీక్షకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. మార్చి 11న ఫలితాలు వెలువడ్డాయి.