Share News

Corruption Allegations: పాల ప్యాకెట్లకే డబ్బుల్లేవు!

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:18 AM

కష్టపడి, పస్తులుండి, అప్పులు చేసి మరీ పిల్లలను చదివించామని.. రేయింబవళ్లు శ్రమించి వాళ్లు గ్రూప్‌-1లో ర్యాంకులు తెచ్చుకున్నారని..

Corruption Allegations: పాల ప్యాకెట్లకే డబ్బుల్లేవు!

  • రూ.3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం?

  • గ్రూప్‌-1 ర్యాంకర్లపై అసత్య ప్రచారం వద్దు

  • వారి జీవితాలను రాజకీయం చేయొద్దు

  • అమ్మింది ఎవరు, కొన్నది ఎవరు? ఆధారాలున్నాయా?

  • సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం

  • కన్నీటిపర్యంతమైన గ్రూప్‌-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు

పంజాగుట్ట, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కష్టపడి, పస్తులుండి, అప్పులు చేసి మరీ పిల్లలను చదివించామని.. రేయింబవళ్లు శ్రమించి వాళ్లు గ్రూప్‌-1లో ర్యాంకులు తెచ్చుకున్నారని.. అలాంటి వారిపై అసత్య ప్రచారాలు చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు వేడుకున్నారు. ‘పాల ప్యాకెట్లకే డబ్బులు లేవు. రూ.3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? మూడు కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. మా బిడ్డల జీవితాలను రాజకీయం చేయొద్దు. అమ్మింది ఎవరు? కొన్నది ఎవరు? ఆధారాలు ఉంటే చూపించండి’ అని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడుతున్న సమయంలో తమ నోటిదగ్గర ముద్దను లాగేశారని వాపోయారు. ఇరుగుపొరుగు వారి అనుమానపు చూపులతో సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌లో ప్రక్రియ ప్రారంభించిందని.. మూడేళ్లుగా అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ తమ పిల్లలు పరీక్షలు రాసి, ర్యాంకులు సాధించారని చెప్పారు.ప్రజాప్రతినిధులు, స్థానికులు సన్మానాలు కూడా చేశారని, త్వరలోనే తమ పిల్లలు గ్రూప్‌-1 అధికారులుగా విధుల్లో చేరతారని సంబరపడ్డామని తెలిపారు. కానీ, ఇప్పుడు తమ సంతోషం ఆవిరైందన్నారు. ఓ వైపు కోర్టు తీర్పు, మరోవైపు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొన్నామన్న రాజకీయ నాయకుల అసత్య ఆరోపణలతో తమ పిల్లలను సన్మానించిన వారే అనుమానిస్తున్నారని వాపోయారు. పిల్లల జీవితాలను రాజకీయం చేయొద్దని కోరారు. కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నిరూపించాలని సవాలు చేశారు. తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకున్నారని తాము నిరూపిస్తామని చెప్పారు.

రూ.30 వేలే చూడలేదు..- 368వ ర్యాంకర్‌ తల్లి.

నాకు ఇద్దరు పిల్లలు. భర్త లేడు. రూ.11,700కు ఒక పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నా. పెద్ద కొడుకును కలెక్టర్‌గా చూడాలని ఆశ. నేను, చిన్న కొడుకు కష్టపడి పని చేశాం. పెద్ద కొడుకు 368వ ర్యాంకు తెచ్చుకున్నాడు. మా ఆశల మీద నీళ్లు చల్లారు. రూ.30 వేలే కలలో కూడా చూడలేదు. రూ.3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? ఉద్యోగం కోసం ఒక్క రూపాయి పెట్టినట్లు రుజువు చేస్తేముగ్గురం చనిపోవడానికి కూడా సిద్ధం


పాల ప్యాకెట్లకే డబ్బుల్లేవు - ఓ ర్యాంకర్‌ తల్లి

పాల ప్యాకెట్లకే డబ్బుల్లేవు. మూడు కోట్లు ఎక్కడి నుంచి తెస్తా. నాకు ఏడుగురు పిల్లలు. పూట గడవడమే కష్టం. నా కూతురికి ర్యాంకు వచ్చింది. ఆమెకు ఉద్యోగం వస్తే కుటుంబానికి అండగా ఉంటుందని అనుకున్నాం. ఆరోపణలు తట్టుకోలేకపోతున్నాం. మాకు న్యాయం చేయాలి.

పిల్లలు ఏమైనా చేసుకుంటే బాధ్యులెవరు? - 67వ ర్యాంకర్‌ తల్లి

నా కుమారుడు ఉదయ్‌ కిరణ్‌ కష్టపడి చదివి, 67వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం రోడ్డున పడ్డాం. రూ.3 కోట్ల నింద వేయవద్దు. భరించలేక పోతున్నాం. అవమానంతో పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరు బాద్యులు?

కాయకష్టం చేసి చదివించాం.. - 60వ ర్యాంకర్‌ తండ్రి

కాయకష్టం చేసి నా కొడుకు మహేశ్‌రెడ్డిని చదివించా. కలెక్టర్‌గా చూడాలని కోరిక. గ్రూప్‌-1లో 60వ ర్యాంక్‌ సాధించాడు. ఎంతో సంతోషపడ్డాం. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు మా బతుకులను ఆగం చేయొద్దు.

Updated Date - Sep 17 , 2025 | 05:18 AM