Hospital Administration: గ్రూప్ 1 అధికారుల చేతికి ఆస్పత్రుల పాలన!
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:06 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యేతర పాలన బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సర్కారీ దవాఖానాల్లో...
బోధనాస్పత్రుల్లో వైద్యేతర బాధ్యతల పర్యవేక్షణ
ప్రయోగాత్మక అమలు.. ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం
కొత్తగా నియమితులైన వారిలో వైద్యశాఖకు
20 మంది.. సూపరింటెండెంట్లకు తగ్గనున్న పని భారం
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యేతర పాలన బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సర్కారీ దవాఖానాల్లో వైద్య, వైద్యయేతర పాలనా వ్యవహారాలన్నింటిని ప్రస్తుతం సూపరింటెండెంట్లే పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారిపై పని భారం అధికంగా ఉంటోంది. పాలన వ్యవహారాలపై అనుభవం లేని సూపరింటెండెంట్లు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా నియమితులైన గ్రూప్-1 అధికారులకు వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో వైద్యయేతర పాలన బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్తగా నియమితులైన గ్రూప్-1 అధికారుల్లో 20 మందిని వైద్య శాఖకు కేటాయించింది. వీరికి కొన్ని నెలల పాటు సాధారణ శిక్షణతోపాటు పాలన వ్యవహారాలపైనా తర్ఫీదు ఇవ్వనున్నారు. అనంతరం వారికి పోస్టింగ్‌లు కేటాయించనున్నారు.
వైద్యయేతర పాలన బాధ్యతలు
ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సూపరింటెండెంట్ పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్, శాలరీలు, కొనుగోలు వ్యవహరాలు, బడ్జెట్ వంటి అంశాలను అడ్మిన్ ఆఫీసర్, అడ్మిన్ డైరెక్టర్ చూస్తుండగా, పారామెడికల్ సిబ్బందికి విధుల కేటాయింపు, వారిపై పర్యవేక్షణ, రోగుల చికిత్స వంటి అంశాలను ఆర్‌ఎంవోలు చూసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఎంత ముఖ్యమో, పారిశుధ్యం, రోగులకు ఆహారం, భద్రత, నిరంతర విద్యుత్ వంటి అంశాలు అంతే కీలకం. వెయ్యి కన్నా ఎక్కువ పడకలు ఉండే ఆస్పత్రుల్లో ఆయా అంశాలన్నింటినీ సూపరింటెండెంట్లు పర్యవేక్షించలేకపోతున్నారు. వారంతా వైద్యులు కావడంతో అడ్మినిస్ట్రేషన్‌పై అంతగా అవగాహన ఉండడం లేదన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. వాస్తవానికి బీఆర్‌ఎస్ హయాంలోనూ బోధనాస్పత్రుల పాలనను ఆర్డీవోలకు అప్పగించాలని నిర్ణయించినా.. వైద్యుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం వైద్యయేతర పాలన బాధ్యతలను మాత్రమే గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రి ప్రాంగణం, వార్డుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా డైట్ కాంట్రాక్టర్ల పనితీరును సమీక్షించడం, రోగులు, వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోవడం, విద్యుత్, నీటి సరఫరా ఉండేలా చూడడం, రోగులకు వీల్ చైర్లు, స్ర్టెచర్లు అందుబాటులో ఉంచడం, సహాయ కేంద్రాల పని తీరును మెరుగుపరచడం, రోగుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం, ఆస్పత్రిలో ఫర్నిచర్, పరికరాల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను గ్రూప్-1 అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది..
వైద్య సేవల్లో నాణ్యత పెరిగే అవకాశం
సర్కారు నిర్ణయం అమల్లోకి వస్తే విధానంతో సూపరింటెండెంట్లపై పని భారం గణనీయంగా తగ్గనుంది. తద్వారా వైద్య ేసవల్లో నాణ్యతను పెంచడంపై వారు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, రోగులకు అందుతున్న చికిత్సా విధానాలు, పరిశోధనలు, వైద్య విద్యార్థులకు శిక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారించడానికి ఈ మార్పు దోహదపడనుంది. ఫలితంగా రోగులకు మరింత నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు అందనున్నాయి. పాలనలో శిక్షణ పొందిన అధికారులు ఈ బాధ్యతలు చేపట్టడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని, ేసవల పనితీరులో స్పష్టమైన మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో 20 మంది అధికారులను నియమించిన ప్రభుత్వం.. వారి పనితీరును సమీక్షించి, భవిష్యత్తులో అన్ని జిల్లా ఆస్పత్రులకు ఈ విధానాన్ని విస్తరించాలని యోచిస్తోంది.