Share News

Group1 Exam Verdict Controversy: గ్రూప్‌-1 తీర్పు తప్పులతడక

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:58 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని.. లేనిపక్షంలో మొత్తం మొయిన్స్‌ పరీక్ష రద్దవుతుందని పేర్కొంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ....

Group1 Exam Verdict Controversy: గ్రూప్‌-1 తీర్పు తప్పులతడక

  • డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ

  • సింగిల్‌ జడ్జి ఇచ్చింది విపరీతమైన తీర్పు

  • పరిధి మీరి మైక్రోస్కోపిక్‌ విచారణ చేశారు

  • మేమిచ్చిన ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు

  • కమిషన్‌ వాదనల కన్నా.. ఉద్యోగసాధనలో విఫలమైన అభ్యర్థుల వాదనలే నమ్మారని వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని.. లేనిపక్షంలో మొత్తం మొయిన్స్‌ పరీక్ష రద్దవుతుందని పేర్కొంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ).. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్‌ దాఖలు చేసింది. తాము సమర్పించిన మెటీరియల్‌ను, ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో సింగిల్‌ జడ్జి పూర్తిగా విఫలమయ్యారని.. అటు చట్టం కోణంలో చూసినా.. ఇటు సుప్రీంకోర్టు తీర్పుల కోణంలో చూసినా సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు తప్పులతడక అని టీజీపీఎస్సీ తన అప్పీల్‌లో పేర్కొంది. ‘‘మునిసిపల్‌ కమిటీ, హోషియార్‌పూర్‌ వర్సెస్‌ పంజాబ్‌ ఎస్‌ఈబీ’’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ‘పర్వర్స్‌ (విపరీతమైన) తీర్పుగా అభివర్ణించింది. ‘‘సింగిల్‌ జడ్జి ఇచ్చిన తుది ఆదేశాలే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒక పక్క సమాధాన పత్రాలను ఎనిమిది నెలల్లో పునర్‌మూల్యాంకనం చేయాలని పేర్కొంటూనే మరో పక్క పునర్‌మూల్యాంకనం చేయకపోతే మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తామని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కారణంతో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టేయవచ్చు. పునర్‌ మూల్యాంకనం చేయడం అనేది టీజీపీఎస్సీ రూల్స్‌లో ఎక్కడా లేదు. ఎట్టిపరిస్థితుల్లో పునర్‌ మూల్యాంకనం ఉండదని రూల్స్‌లో చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా ఊహలు, అంచనాల ఆధారంగా సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. అందులో జడ్జి వ్యక్తంచేసిన అభిప్రాయాలకు ఎలాంటి ఆధారాలూ లేవు. మెయిన్స్‌ పరీక్షకు హాజరైన వారి సంఖ్యలో ఎలాంటి తేడాలూ లేవు. పూర్తిగా బయోమెట్రిక్‌ ఆధారంగా మొత్తం అభ్యర్థుల హాజరు వివరాలను ప్రకటించాం. ‘బొమ్ము పూజితారెడ్డి’ అనే అభ్యర్థికి సంబంధించిన మార్కుల జాబితాను ఫోర్జరీ చేసి సమర్పించిన రిట్‌ పిటిషన్‌ కూడా సింగిల్‌ జడ్జి విచారణకు స్వీకరించడం సమంజసం కాదు. ఇలాంటి మరో పిటిషన్‌ను మరో సింగిల్‌ జడ్జి జరిమానా విధించి మరీ కొట్టేయడంతోపాటు ప్రాసిక్యూట్‌ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిన విషయాన్ని సింగిల్‌ జడ్జి పట్టించుకోలేదు. పోలీసు దర్యాప్తులో సైతం.. సదరు మార్కుల జాబితాను ఫోర్జరీ చేసినట్లు తేలింది. అలాంటి తప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా దాఖలైన పిటిషన్‌పై తీర్పు ఇవ్వడం సరికాదు. రెండు వేర్వేరు హాల్‌టికెట్‌లపై సింగిల్‌ జడ్జి రూలింగ్‌ తప్పుడు అభిప్రాయం. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు ఒకటే హాల్‌టికెట్‌ ఉంటుందని కమిషన్‌ ఎక్కడా చెప్పలేదు. తొలుత 45 సెంటర్లు అనుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థుల కోసం ఒక సెంటర్‌ పెంచాల్సి వచ్చింది. కోఠి మహిళా కళాశాలలో పురుషలకు టాయిలెట్స్‌ ఇతర వసతులు లేని కారణంగానే అక్కడ మహిళలను కేటాయించాల్సి వచ్చింది.


కొంతమంది అభ్యర్థులను కొన్ని సెంటర్లకు ఎంపిక చేసి కేటాయించారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం, ఆధారాలు లేవు. ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో ఉన్న ఒక ఫీచర్‌ ఆధారంగానే కొన్ని సెంటర్లకు మహిళలు, కొన్ని సెంటర్లకు పురుషులను ప్రత్యేకంగా కేటాయించాం. కోఠి మహిళా కళాశాలలో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు అర్హత సాఽధించారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవు. అక్కడ అభ్యర్థులందరూ మహిళలే కాబట్టి ఎక్కువ మంది మహిళలు అర్హత సాధించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లాంటి సంస్థకు ‘ఏ పద్ధతి పాటించాలి’ అని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు స్వయంగా పేర్కొంది. అలాంటప్పుడు మోడరేషన్‌ పద్ధతి పాటించాలని ఆదేశించడం సమంజసం కాదు. సింగిల్‌ జడ్జి తన పరిధి మీరి మైక్రోస్కోపిక్‌ ఎంక్వైరీ చేయడం అనుమతించదగిన విషయం కాదు. పలు అంశాల ఆధారంగా నిపుణులు చేయాల్సిన నిర్ణయాలను సింగిల్‌ జడ్జి చేయడం సరి కాదు. భారీఎత్తున అభ్యర్థులు హాజరైన పరీక్షలో కొంతమంది అభ్యర్థులకు ఒకేరకమైన మార్కులు రావడం సహజం. ఇలాంటి విషయాలను సైతం సింగిల్‌ జడ్జి తప్పుబట్టడం సరికాదు. కమిషన్‌ ఉద్యోగులే ఎవాల్యుయేటర్ల జాబితాను బయటకు ఇచ్చారని సింగిల్‌ జడ్జి వ్యాఖ్యానించడం సమంజసం కాదు. ‘ఎంఏ మాలిక్‌’ అనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ‘ఆర్‌సీ రెడ్డి’ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్‌లు చెప్పలేదు. ప్రభుత్వ కాలేజీల ప్రొఫెసర్లు పుస్తకాలు రాయడం తప్పుకాదు.. వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. తెలుగు మాధ్యమ అభ్యర్థుల పట్ల వివక్ష జరిగిందన్న వాదనకు ఎలాంటి ఆధారాలూ లేవు. సింగిల్‌ జడ్జి అవగాహన కోసం రహస్యంగా సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన రహస్య సమాచారాన్ని మొత్తాన్ని జడ్జిమెంట్‌లో బయటపెట్టడం ద్వారా పరీక్ష వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరించడంతోపాటు ప్రమాదంలోకి నెట్టారు. సమాధాన పత్రాల మూల్యాంకనంలో కమిషన్‌ సరైన పద్ధతి పాటించలేదని సింగిల్‌ జడ్జి చేసిన వ్యాఖ్య వికృతమైన వ్యాఖ్య. కమిషన్‌ చెప్పిన విషయాల కంటే.. ఉద్యోగాలు సాధించడంలో విఫలమైన అభ్యర్థుల వాదనలనే సింగిల్‌ జడ్జి ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నారు.’ అని టీజీపీఎస్సీ తన అప్పీల్‌లో పేర్కొంది.

Updated Date - Sep 18 , 2025 | 04:58 AM