Greenfield road linking Future City: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు షురూ
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:58 AM
భారత్ ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మహానగరాన్ని, భారత్ ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే ప్రధాన రోడ్డును 300 అడుగులతో నిర్మించే పనులు చేపట్టారు.....
ఫ్యూచర్ సిటీ నుంచి హైదరాబాద్‌కు.. రతన్‌టాటా రోడ్డుగా నామకరణం
ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం
భూసేకరణ పూర్తయ్యాకే ప్రైవేటు భూముల్లోకి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మహానగరాన్ని, భారత్ ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే ప్రధాన రోడ్డును 300 అడుగులతో నిర్మించే పనులు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు ధీటుగా నాలుగో నగరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే ఈ ప్రధాన రోడ్డుకు రతన్‌టాటా రోడ్డుగా ఇప్పటికే నామకరణం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల(టాటా ఇంటర్ ఛేంజ్) నుంచి ఫ్యూచర్ సిటీ మీర్‌ఖాన్‌పేట మీదుగా అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు(రతన్‌టాటా రోడ్డు) వరకు 300 అడుగులతో 41.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉండగా వివిధ గ్రామాల రైతులు అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులు కేవలం ప్రభుత్వ భూముల్లోనే చేపట్టారు. రైతుల అంగీకారం తెలిపిన తర్వాతే భూసేకరణ చేసి నిర్మాణం చేస్తామని అధికారులు చెబుతున్నారు.
14గ్రామాల మీదుగా గ్రీన్ ఫిల్డ్ రోడ్డు
హైదరాబాద్ మహా నగరానికి ఫ్యూచర్ సిటీకి లింకు చేసే ప్రధాన రహదారి రతన్‌టాటా రోడ్డును రంగారెడ్డి జిల్లాలోని 6మండలాల (మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, అమన్‌గల్) పరిధిలోని 14గ్రామాల మీదుగా గ్రీన్ ఫిల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఔటర్ ఎగ్జిట్-13 రావిర్యాల(టాటా ఇంటర్‌ఛేంజ్) నుంచి కొంగరఖుర్దు, కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, లేమూర్, తిమ్మాపూర్, రచ్లూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట(ఫ్యూచర్ సిటీ) వరకు 18 కిలోమీటర్లు. అక్కడి నుంచి ముచ్చెర్ల, కుర్మిద్ధ, కడ్తాల్, ముద్విన్, అమన్‌గల్, ఆకుతోటపల్లి వద్ద రీజినల్ రింగ్ రోడ్డుకు లింకు చేయనున్నారు. 41.5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును 300 అడుగులతో(వంద మీటర్లు) నిర్మించనున్నారు. ఈ 41.5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు 916 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో పట్టా భూములే 568 ఎకరాల వరకు ఉన్నాయి. ఈ భూముల సేకరణకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఫారెస్టు భూములు, టీజీఐఐసీ భూములు, ప్రభుత్వ భూములను 348ఎకరాల వరకు సేకరించారు. రతన్‌టాటా రోడ్డును 6 లేన్ల ప్రధాన రోడ్డు మార్గంగా భవిష్యత్తులో 8లేన్లుగా పెంచేందుకు అనువుగా నిర్మిస్తారు. 2 ప్లస్ 2 మీటర్ల పచ్చదనంతో సెంట్రల్ మీడియన్‌లో మెట్రో లేదా రైల్వే కారిడార్ కోసం 20మీటర్ల వెడల్పుతో భూమి రిజర్వు చేస్తారు. ఇరువైపులా 3 లేన్ల సర్వీసు రోడ్డు, రెండు మీటర్ల వెడల్పు గల గ్రీన్‌బెల్ట్, 3 మీటర్ల వెడల్పు గల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల వెడల్పు గల ఫుట్‌పాత్, రెండు వైపులా 2 మీటర్ల వెడల్పు గల యుటిటిటీ కారిడార్ నిర్మిస్తారు.