Underground Power Cables: గ్రేటర్‌లో రూ.4,051 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:43 AM
గ్రేటర్ హైదరాబాద్‌లోని మెట్రో జోన్(బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్)లో రూ.4,051 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను...
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లోని మెట్రో జోన్(బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్)లో రూ.4,051 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయా ప్రాంతాల్లో 11 కేవీ, 33 కేవీ ఓవర్‌హెడ్, ప్రధాన రహదారులపై ఉన్న ఎల్‌టీ ఓవర్‌హెడ్‌లను తొలగించి... ఆ స్థానంలో భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. ప్రధానంగా మెట్రో జోన్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడం, విద్యుత్ అంతరాయాలను తగ్గించడం ద్వారా ఆర్థికవృద్ధిని పెంచడానికి భూగర్భ కేబుల్ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని కింద ఆయా సర్కిళ్లలోని ప్రధాన రహదారుల్లో ఉన్న విద్యుత్ వైర్లను తొలగించనున్నారు. దీనికి రూ.4,051 కోట్లు అవుతాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు అయ్యే నిధులను రుణ రూపంలో సమీకరించుకోవాలని ప్రభుత్వం డిస్కమ్‌కు నిర్దేశించింది.