Saddula Bathukamma: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:43 AM
ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో వచ్చి ఆడిపాడారు....
అమరవీరుల స్తూపం నుంచి బతుకమ్మలతో మహిళల ర్యాలీ
ఆడిపాడిన మంత్రి సురేఖ.. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
హైదరాబాద్ సిటీ, కవాడిగూడ, హైదరాబాద్ సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో వచ్చి ఆడిపాడారు. మహిళలు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ర్యాలీగా ట్యాంక్‌బండ్ పైకి చేరుకున్నారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పెద్దఎత్తున హాజరై చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సందడి చేశారు. తెలంగాణ టూరిజం శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక శాఖకు చెందిన కళాకారులు.. బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలు, చిందు, యక్షగానంతో ట్యాంక్‌బండ్ పైకి వచ్చే బతుకమ్మలకు స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి పాడారు. రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు పర్యాటక శాఖ చేసిన కృషి ఫలితంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఆటను గతంలో మాదిరిగా పెద్దవాళ్లు రూపకల్పన చేసిన పాటలతో కాకుండా పాశ్చాత్య పాటలతో ఆడుతున్నారని, ఇది మంచిది కాదని, పాత పద్ధతిలోనే ఆడాలని సూచించారు. ఒకవేళ బతుకమ్మ ఆటను పాశ్చాత్య పాటలతో ఆడుకోవాలనుకుంటే ప్రైవేటు కార్యక్రమాల్లో ఆడుకోవొచ్చునని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, టూరిజం ఎండీ క్రాంతి, మహిళా కమిషన్ చైర్మన్ శారద, నగర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నెల గద్దర్, నిర్మలారెడ్డి, పంజాల అలేఖ్య, కాల్వ సుజాత హాజరయ్యారు. రాత్రి వరకు బతుకమ్మల చుట్టురా ఆడిపాడిన మహిళలు బతుకమ్మ ఘాట్ వద్ద హుస్సేన్‌సాగర్‌లోకి వదిలారు.