kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:45 PM
రైతుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, కొమురవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు స్థలాలను బుధవారం పరిశీలించారు.
రెబ్బెన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, కొమురవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు స్థలాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి నాణ్యమైన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు 40 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీక్లీనర్లు, ట్యాబ్‌లు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల కోసం తాగునీరు, నీడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిబ్బందికి సూచించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.