Graduate Prisoners: గ్రాడ్యుయేట్ ఖైదీలు!
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:16 AM
క్షణికావేశం, విచక్షణా రాహి త్యం... కారణాలేమైనా వారంతా నేరారోపణలతో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు....
సంకెళ్లను ఛేదించి సరస్వతీ పుత్రులుగా రాణించి..
గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్న ఖైదీలు
అంబేడ్కర్ వర్సిటీ స్నాతకోత్సవం..
గోరేటి వెంకన్న, ప్రేమ్ రావత్‌లకు గౌరవ డాక్టరేట్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం, విచక్షణా రాహి త్యం... కారణాలేమైనా వారంతా నేరారోపణలతో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. చేసిన తప్పునకు జైల్లో శిక్ష అనుభవిస్తూనే.. మరోవైపు పరివర్తనలో భాగంగా ఉన్నత విద్య పూర్తిచేశారు. ఆసక్తి కలిగిన ఖైదీలు తిరిగి చదువుకోడానికి ‘విద్యాదానం’ పేరుతో జైలు అధికారులు చేసిన వినూత్న ఆలోచనకు నాంది పలకడానికిడా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. చర్లపల్లి, చంచలగూడ, కడప, రాజమండ్రి తదితర జైళ్లలో విద్యా కేంద్రాలు ప్రారంభించింది. ఏపీ, తెలంగాణ నుంచి 2023-24 సంవత్సరానికి గా ను ఏకంగా 203మంది ఖైదీలు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సులు పూర్తి చేసినట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. మంగళవారం అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన 26వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోర్సులు పూర్తిచేసిన వారికి పట్టాలు అందించారు. వీరిలో ఇద్దరు ఖైదీలు బంగారు పతకం సాధించారు. పట్టా పొందిన వారిలో చర్లపల్లి, చంచల్‌గూడ కేంద్ర కారాగారాల్లోని ఖైదీలు 9 మంది, ఖైదీలుగా ఉన్న సమయంలో డిగ్రీ మొదలుపెట్టి విడుదలైన తర్వాత పట్టా పొందిన మరో నలుగురు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో వర్సిటీ నుంచి ఇప్పటి వరకు 25 మంది పురుషులు, ముగ్గురు మహిళలు యూజీ కోర్సులు పూర్తి చేశారని జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్యా మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో, తెలుగు సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న గోరేటి వెంకన్నతో పాటు పాఠశాలల్లో విద్యార్థుల చేరికను ప్రోత్సహిస్తూ.. నేరాల శాతం తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రేమ్ రావత్‌లకు గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.