Share News

Employee Health Scheme: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వారంలో విధివిధానాలు

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:55 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన విధివిధానాలను వారం రోజుల్లో ఖరారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగుల ఐకాస వెల్లడించింది. దీంతో తాము తలపెట్టిన బస్సుయాత్ర, చలో హైదరాబాద్‌...

Employee Health Scheme: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వారంలో విధివిధానాలు

  • దశలవారీగా సమస్యల పరిష్కారానికి సర్కారు హామీ ఇచ్చింది

  • మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల ఐకాస వెల్లడి

  • బస్సుయాత్ర, చలో హైదరాబాద్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన విధివిధానాలను వారం రోజుల్లో ఖరారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగుల ఐకాస వెల్లడించింది. దీంతో తాము తలపెట్టిన బస్సుయాత్ర, చలో హైదరాబాద్‌ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలపై సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీ సమావేశం నిర్వహించింది. అనంతరం ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు విలేకరుల సమావేశంలో భేటీ వివరాలను వెల్లడించారు. డిప్యూటీ సీఎం, ఉప సంఘం చైర్మన్‌ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ రామకృష్ణారావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత చికిత్స అందించేందుకు వీలుగా ఆరోగ్య పథకం అమలుకు ఈనెల 8వ తేదీలోపు విధివిధానాలను ప్రకటిస్తామన్న హామీ లభించిందని వెల్లడించారు. ఆపై వీలైనంత త్వరగా ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు జారీ చేస్తామని చెప్పారని తెలిపారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు సంబంధించి గతంలో ఇచ్చి న హామీ మేరకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని చెప్పారని వెల్లడించారు. నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని, విజిలెన్స్‌, ఏసీబీ కేసులతో రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉన్నవారికి దశలవారీగా పోస్టింగులు ఇవ్వనున్నట్లు చెప్పారని వెల్లడించారు. ఉద్యోగులు, ప్రభు త్వం వేరు కాదని.. సుపరిపాలన కోసం అందరం కలిసి పని చేద్దామని భట్టి విక్రమార్క తమతో అన్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రతిపాదించిన 63 డిమాండ్లలో 25కు పైగా ప్రభుత్వం నెరవేర్చిందని, మిగిలిన సమస్యలనూ ద శలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


లచ్చిరెడ్డి ఐకాసకు నో ఎంట్రీ

ఉద్యోగుల ఐకాస పేరుతో లచ్చిరెడ్డి నేతృత్వంలో వచ్చిన ప్రతినిధులను సమావేశంలోకి అనుమతించేందుకు తాము అంగీకరించలేదని మారం జగదీశ్వర్‌ నేతృత్వంలో ని ఉద్యోగుల ఐకాస పేర్కొంది. సచివాలయంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు రాగా.. వారిని కూడా అనుమతించాలని భద్రతా సిబ్బందికి భట్టి విక్రమార్క సూచించారని ఐకాస ప్రతినిధులు చెప్పారు. అయితే తమతో చర్చలు జరుపుతారా? లేదంటే లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఐకాసతో చర్చలు జరుపుతారా? నిర్ణయించుకోండి అని.. ఒకవేళ వారితో చర్చలు జరపాలని నిర్ణయిస్తే తాము వెళ్లిపోతాం అని తాము స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఫలితంగా లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఐకాస ప్రతినిధులకు లోనికి అనుమతించలేదని వారు వెల్లడించారు.

Updated Date - Sep 03 , 2025 | 04:55 AM