Minister Tummala Nageswara Rao: ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:17 AM
ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున మక్కలు సేకరించాలని మార్క్‌ఫెడ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు...
సేకరణ పరిమితి పెంచాలి.. మార్క్‌ఫెడ్‌కు తుమ్మల ఆదేశం
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున మక్కలు సేకరించాలని మార్క్‌ఫెడ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇప్పటివరకు ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండగా.. వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మక్కల సేకరణ పరిమితిని పెంచినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా.. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలనే ఉద్దేశంతో రూ. 2,500 కోట్లు కేటాయించామని తుమ్మల తెలిపారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. జిన్నింగ్ మిల్లుల్లో నెలకొన్న సమస్యలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. మరోవైపు.. రైతులు వరి, పత్తి పంటలకు బదులుగా పామాయిల్ సాగు చేపట్టాలని తుమ్మల సూచించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతులకు మంత్రి తుమ్మల భూసార పరీక్ష పత్రాలు పంపిణీ చేశారు.
రూ.1000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించింది. 7.45 శాతం వార్షిక వడ్డీ, 32 ఏళ్ల కాల పరిమితితో ఈ రుణాన్ని తీసుకున్నది. రాష్ట్రంతో కలిపి దేశంలోని ఏడు రాష్ట్రాలు రూ.11,600 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.
1,037 మంది ఔట్‌సోర్సింగ్ పీఎ్‌సల కొనసాగింపు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 1,037 మంది ఔట్‌సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. 01.04.2025 నుంచి 31.03.2026 వరకు ఏడాది పాటు విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది.