Share News

Real Estate Booms: హైదరాబాద్‌లో దూసుకెళుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:17 AM

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధిలో దూసుకెళుతోందని, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరం భూమి..

Real Estate Booms: హైదరాబాద్‌లో దూసుకెళుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం

  • రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం

  • హైరైజులు, విల్లాలే కాదు దిగువ, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకోండి

  • సీఎ్‌సఆర్‌ నిధులు విద్య, వైద్య రంగాల్లో వెచ్చించండి

  • నరెడ్కో ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధిలో దూసుకెళుతోందని, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైరైజు బిల్డింగులు, విల్లాలకే పరిమితం కాకుండా దిగువ, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని బిల్డర్లు ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏటా రూ.10 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో రూ.20 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఇటీవల 39 సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల(ఎస్‌టీపీ) పనులకు ఆమోదం తెలిపామన్నారు. సీవరేజీ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం దాదాపు రూ.11,927 కోట్లను ఖర్చు చేస్తున్నామని, రూ.13,704 కోట్లతో మరికొన్ని తాగునీటి, సీవరేజీ ప్లాంట్ల పను లు ప్రతిపాదనల్లో ఉన్నాయని వివరించారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రం మారబోతోందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం ఉంటుందని చెప్పారు. హైడ్రా ఏర్పాటుతో వచ్చిన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి నేషనల్‌ హైవేను కలుపుతూ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.1,487 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు.


రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు కేంద్ర రక్షణ మంత్రి నుంచి సీఎం రేవంత్‌ అనుమతి సాధించారన్నారు. శామీర్‌పేటలో రూ.3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని చెప్పారు. దేశంలోని ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌, మంచినీటిని హైదరాబాద్‌లో అందిస్తున్నామన్నారు. ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులే ఉంటాయని పేర్కొన్నారు. తమది బిజినెస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని దట్టమైన అడవులు, జలపాతాలు, టైగర్‌ ఫారె్‌స్టలకు వివిధ వర్గాల వారిని రియల్టర్లు తరచూ తీసుకెళ్లాలని కోరారు. రియల్టర్లు, బిల్డర్లను ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా గౌరవిస్తుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. విద్య, వైద్యం ప్రభుత్వ ప్రాధాన్య రంగాలని, సీఎ్‌సఆర్‌ నిధులను ఆయా రంగాల్లో ఖర్చు చేయాలని నరెడ్కో ప్రతినిధులకు ఆయన సూచించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌ అభివృద్ధికి ఏవిధంగా దోహదపడిందో.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా ఎదగడానికి అన్ని రంగాల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కాగా, నరెడ్కో ఆధ్వర్యంలో రూపొందించిన సావనీర్‌ను భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, నరెడ్కో ఆలిండియా అధ్యక్షుడు హరిబాబు, తెలంగాణ అధ్యక్షుడు ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌, కాళీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 03:17 AM