High Court Chief Justice Apresh Kumar Singh: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:33 AM
రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా జీవనం కొనసాగించడానికి వీలుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, ఇందులో....
రాజ్యాంగంలో వెసులుబాటు వల్లే తెలంగాణ ఏర్పడింది
రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్య
రాజ్యాంగ విలువలను ఆచరించాలి
హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్ సింగ్
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా జీవనం కొనసాగించడానికి వీలుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కేవైసీ(రాజ్యాంగాన్ని తెలుసుకుందాం:నో యువర్ కాన్‌స్టిట్యూషన్) మంత్రాన్ని యువతకు అందజేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ఆధారంగానే తెలంగాణ ఏర్పాటైందని, జాతీయ సమగ్రత ఏ మాత్రం దెబ్బతినకుండా ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించే విధంగా రాజ్యాంగం అవకాశా లు కల్పించందని చెప్పారు. హైకోర్టులో బుధవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని, ఇది భారతీయులందరూ వేడుక చేసుకోవాల్సిన శుభదినమని అన్నారు. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అప్పటి నిర్మాతలు మనకు అందించారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అలుపెరుగని పోరాటం చేశారని ఆయన కొనియాడారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మేధస్సు, నైతిక ధైర్యం, న్యాయంపై అచంచలమైన నిబద్ధతతో రూపుదిద్దుకున్న రాజ్యాంగం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని, సామాజిక మార్పు కోసం ఒక పరివర్తన చార్ట్ అని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కోర్టు గదులకే పరిమితం కాకూడదని, ఇది ప్రతి వ్యక్తి, ప్రతి సమాజం, ప్రతి ఇంటిని చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులందరూ రాజ్యాంగ విలువలను అర్థం చేసుకుని, ఆచరించినప్పుడే దాని ఉద్దేశం సాకారమవుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీఏ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎ.జగన్ తదితరులు పాల్గొన్నారు.