Governor J Shinu Dev Verma: డ్యూటీ మీట్.. సంస్కరణలకు మైలురాయి
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:52 AM
ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్ కార్యక్రమం జైళ్ల సిబ్బంది మధ్య పోటీ కోసం కాదని.. క్రమశిక్షణ, విధి నిర్వహణలో ..
రాష్ట్ర జైళ్ల శాఖ పనితీరు అభినందనీయం: గవర్నర్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్ కార్యక్రమం జైళ్ల సిబ్బంది మధ్య పోటీ కోసం కాదని.. క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితభావం పెంపొందించుకునేందుకు చక్కని వేదిక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రిజన్స్ డ్యూటీ మీట్ దేశవ్యాప్తంగా జైళ్లల్లో సంస్కరణలకు మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోలీస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్-2025ని గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, జైళ్ల శాఖ అనేక సంస్కరణలు తెచ్చిందని అభినందించారు. విధి నిర్వహణలో జైలు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతను గవర్నర్ ప్రశంసించారు. క్రీడల వల్ల విధి నిర్వహణలో ఉత్సాహం పెరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. డ్యూటీ మీట్‌తో అన్ని రాష్ట్రాల జైళ్ల శాఖ సిబ్బంది ఒక చోట కలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా అన్నారు. సిబ్బంది నైతిక విలువలతో పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖలో అనేక సంస్కరణలు జరిగాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఖైదీల పట్ల జైలు సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.