Supreme Court: టెట్‌పై రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:38 AM
ఐదేళ్లు పైబడిన సర్వీసున్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు పైబడిన సర్వీసున్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలని.. లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ఇచ్చిందని, అప్పటికే నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చిందన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.