Irregular NOC Issuance for Lakes and Ponds: ఎన్‌వోసీ ఇంజనీర్లపై బదిలీ వేటు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:44 AM
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు ఎన్‌వోసీలు జారీ చేసే అడ్డగోలు దందాకు...
రాజధానిలో చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన వారిపై కొరడా
హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు 51 మంది బదిలీ
వర్కింగ్ అరేంజ్‌మెంట్ పేరుతో పంపించిన ప్రభుత్వం
వారి స్థానాల్లో జిల్లాల నుంచి 55 మంది ఓడీపై రాక
నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) జారీ చేసే అడ్డగోలు దందాకు బ్రేక్ వేసే దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్(సీఈ) దాకా భారీగా ముడుపులు తీసుకుంటూ ఎన్‌వోసీలు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏకంగా 51 మంది ఇంజనీర్లపై బదిలీ వేటు వేసింది. నీటిపారుదల శాఖ చరిత్రలోనే తొలిసారిగా వర్కింగ్ అరేంజ్‌మెంట్ పేరుతో వారికి స్థానచలనం కల్పించింది. హైదరాబాద్ సీఈ పరిధి నుంచి ఇతర జిల్లాలకు ఆన్‌డ్యూటీపై పంపించింది. వారి స్థానంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం మెమో నెం.8180 జారీ చేశారు. ఏఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ), ఎగ్జ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎ్‌సఈ), డిప్యూటీ సీఈ హోదాలో హైదరాబాద్ సీఈ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 51 మంది ఇంజనీర్లను హైదరాబాద్ నగరం బయటి ప్రాంతాలకు పంపించారు. వారి స్థానంలో జిల్లాల్లో పనిచేస్తున్న 55 మంది ఇంజనీర్లను ఆన్‌డ్యూటీపై హైదరాబాద్ సర్కిల్ సీఈ కార్యాలయం పరిధిలో నియమించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ మేరకు ఉద్యోగుల సర్దుబాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నీటిపారుదల శాఖలో హైదరాబాద్, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రాంతాలంటేనే ఎన్‌వోసీల జారీకి కేంద్రాలనే ఆరోపణలున్నాయి. పైసలిస్తే చాలు.. చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మాణాలకు కూడా నిరభ్యంతరంగా ఎన్‌వోసీలు ఇస్తారనే పేరుంది. దీనిపై ఇప్పటికే సీఎం కార్యాలయంతోపాటు నీటిపారుదల శాఖ మంత్రికి కూడా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని వారం క్రితం ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో దీనిపై కసరత్తు పూర్తి చేశారు. పైరవీలు, రాజకీయ పలుకుబడితో కార్యాలయం పరిధిలో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలుండడంతో క్షేత్ర స్థాయి పోస్టుల్లో పనిచేేస ఇంజనీర్లందరినీ బదిలీ చేయాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. సంబంధిత ఉద్యోగుల జీతాలను ఆర్థిక శాఖ నిలుపుదల చేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఆన్‌డ్యూటీపై ఇతర ప్రాంతాలకు పంపించి.. నిషేధం ఎత్తివేసిన తర్వాత బదిలీ చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
కొత్తకుంట ఎన్‌వోసీతో కదిలిన డొంక..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ లోని కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు ఎన్‌వోసీ జారీ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇటీవల నీటిపారుదల శాఖ విచారణ జరిపించగా.. సంచలన అంశాలు వెలుగుచూశాయి. కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్ 8.284 ఎకరాల్లో విస్తరించి ఉండగా, 2.03ఎకరాలేనని పేర్కొంటూ ఎన్‌వోసీ జారీ చేశారని హైడ్రా, నీటిపారుదల శాఖ విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఎన్‌వోసీ జారీ రికార్డులను మాయం చేసినట్టు వెల్లడైంది. నిబంధనల ప్రకారం.. ఎన్‌వోసీ జారీ చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి ఫైలు రావాలి. ఆ ఫైలులో నోట్స్ ఉంటాయి. కానీ, అసలు ఫైలే లేకుండా ఎన్‌వోసీ జారీ చేయడంపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సీఈ కె.ధర్మను గతంలోనే పోస్టు నుంచి తొలగించి సరెండర్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏఈఈ వి.గంగరాజు ఏడాదిగా విధులకు గైర్హాజరవుతున్నారు.డీఈఈ కె.జగదీశ్వర్, ఈఈ కె.బన్సీలాల్, ఎస్‌ఈ హైదర్‌ఖాన్ సైతం పాత్రధారులుగా గుర్తించారు. వీరిలో గంగరాజు, కె.జగదీశ్వర్‌ను ప్రభుత్వం ఓడీపై ఇతర జిల్లాలకు పంపించింది. మరో ఎస్‌ఈ పుష్కర్‌ను ఇటీవలే బదిలీ చేసింది.